Share News

Bhatti Vikramarka: ప్రజా ప్రతినిధుల సిఫారసు బిల్లులకు ప్రాధాన్యం

ABN , Publish Date - Feb 07 , 2025 | 03:25 AM

మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన ఆర్థిక బిల్లులను క్లియర్‌ చేయడానికి ప్రాధాన్యమిస్తున్నామని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

Bhatti Vikramarka: ప్రజా ప్రతినిధుల సిఫారసు బిల్లులకు ప్రాధాన్యం

  • మంత్రుల్లో ఎక్కువ క్లియరైంది జూపల్లివే

  • ఉత్తమ్‌, పొంగులేటి తక్కువ సిఫారసులు

  • సీఎల్పీ భేటీలో వెల్లడించిన భట్టి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన ఆర్థిక బిల్లులను క్లియర్‌ చేయడానికి ప్రాధాన్యమిస్తున్నామని డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజా ప్రతినిధుల బిల్లులను క్లియర్‌ చేయడం లేదన్న ఆరోపణలు వాస్తవం కాదని, వారు సిఫారసు చేసిన బిల్లులకు ప్రాధాన్యమిస్తున్నామంటూ సీఎల్పీ సమావేశంలో ఆధారాలతో సహా ఆయన వివరించారు. సీఎల్పీ సమావేశంలో బిల్లుల క్లియరెన్స్‌ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. వెనక సీట్లలో కూర్చున్న ఓ ఎమ్మెల్యే లేచి తమ బిల్లులను పట్టించుకోవడం లేదని చెప్పారు. దీనికి వెంటనే స్పందించిన భట్టి విక్రమార్క.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బిల్లుల క్లియరెన్స్‌ గురించి సోదాహరణంగా వివరించారు. ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే ఎన్నెన్ని సిఫారసులు చేశారు?, ఎన్ని బిల్లులను క్లియర్‌ చేయడం జరిగింది? వాటికి చెల్లించిన నిధులు ఎన్ని తదితర వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సిఫారసు లేఖలు ప్రజా ప్రతినిధుల లెటర్‌ హెడ్స్‌పై వచ్చినట్లు చూపించారు. ఆర్థిక శాఖ ద్వారా క్లియర్‌ చేస్తున్న వివిధ రకాల బిల్లుల విషయంలో ఇప్పటికే ఆరోపణలు వస్తున్నాయి.


కమీషన్లు, పర్సంటేజీలు ఇచ్చిన వారి బిల్లులను మాత్రమే క్లియర్‌ చేస్తున్నారని అటు ప్రతిపక్షాలు, ఇటు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆర్థిక శాఖలో సంవత్సరాల తరబడి పాతుకుపోయిన కొంతమంది అధికారులు, ప్రభుత్వ పెద్దల చేతివాటమే ఇందుకు కారణమని విమర్శిస్తున్నారు. ఎమ్మెల్యేలు అలిగి ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకోవడానికి బిల్లులు క్లియర్‌ కాకపోవడం కూడా ఒక కారణమన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బిల్లుల క్లియరెన్స్‌పై భట్టి విక్రమార్క స్పష్టతనిచ్చినట్లు తెలిసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిఫారసు చేస్తున్న కాంట్రాక్టు పనుల తాలూకు బిల్లులతోపాటు ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులు వంటివాటిని క్లియర్‌ చేస్తున్నామని చెప్పినట్లు సమాచారం. బిల్లులు ఎక్కువగా క్లియర్‌ చేసుకున్న మంత్రుల్లో ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అగ్రస్థానంలో ఉన్నారని తెలిసింది. తక్కువగా క్లియర్‌ చేయించుకున్న మంత్రుల్లో ఉత్తమ్‌, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి ఉన్నారని సమాచారం. కొంతమంది మంత్రులు నేరుగా సీఎం రేవంత్‌ ద్వారా క్లియర్‌ చేయించుకుంటుండడంతో భట్టి ద్వారా తక్కువమంది వెళ్లినట్లు తేలిందని చర్చ జరుగుతోంది.

Updated Date - Feb 07 , 2025 | 03:25 AM