Bhatti Vikramarka: బిల్డర్లు, డెవలపర్లకు సంపూర్ణ సహకారం
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:04 AM
రాష్ట్రంలోని బిల్డర్లు, డెవలపర్లు సంపద సృష్టికర్తలని, వారిని గౌరవప్రద పౌరులుగా చూస్తామని, సంపూర్ణ సహకారం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
వారిని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
హైదరాబాద్‌ను ‘గ్రీన్ సిటీ’గా మారుస్తాం
ప్రపంచ గమ్యస్థానంగా ఫోర్త్ సిటీ: భట్టి
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బిల్డర్లు, డెవలపర్లు సంపద సృష్టికర్తలని, వారిని గౌరవప్రద పౌరులుగా చూస్తామని, సంపూర్ణ సహకారం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో శనివారం బిల్డర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన హరిత తెలంగాణ సదస్సులో డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. బిల్డర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసి, బిల్డర్లు, డెవలపర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిల్డర్లు, డెవలపర్లకు హైదరాబాద్ స్వర్గధామమని అభిప్రాయపడ్డారు. ‘రైజింగ్ తెలంగాణ’ దిశగా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు.
ఢిల్లీలో కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకోని హైదరాబాద్‌ను గ్రీన్ సిటీగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాజధానిలోని డీజిల్ వాహనాలను దశల వారీగా ఎలక్ర్టిక్ వాహనాలుగా మారుస్తామన్నారు. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ప్రపంచ గమ్యస్థాన కేంద్రంగా ఫోర్త్ సిటీని తీర్చిదిద్దుతామని అన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఒక మైలు రాయి అని అన్నారు. 2029-30కల్లా 20,000మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా కొత్త పాలసీని రూపొందించామన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా హైదరాబాద్ అభివృద్ధికి రూ.10వేల కోట్లను కేటాయించామన్నారు.