Share News

Bhatti Vikramarka: వేసవిలో.. విద్యుత్తు అంతరాయం ఉండొద్దు

ABN , Publish Date - Feb 12 , 2025 | 05:11 AM

‘‘వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్తు అంతరాయం ఉండొద్దు. రెప్పపాటు కాలం కూడా కరెంట్‌ కట్‌ కావొద్దు. వేసవి డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా ఉండాలి’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Bhatti Vikramarka: వేసవిలో.. విద్యుత్తు అంతరాయం ఉండొద్దు

  • రెప్పపాటు కూడా కరెంట్‌ కట్‌ కావొద్దు

  • ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘‘వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్తు అంతరాయం ఉండొద్దు. రెప్పపాటు కాలం కూడా కరెంట్‌ కట్‌ కావొద్దు. వేసవి డిమాండ్‌కు తగ్గట్లుగా సరఫరా ఉండాలి’’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో టీజీఎస్పీడీసీఎల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు నిత్యావసరమైన విద్యుత్తును నిరవధికంగా అందజేయాలని సూచించారు. వేసవి ప్రణాళికపై అన్ని స్థాయుల్లో సమావేశాలు నిర్వహించుకుని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ‘‘ప్రస్తుతం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో పనిచేస్తున్న విద్యుత్తు ఎమర్జెన్సీ వాహనాల సేవలను గ్రామాలకు కూడా విస్తరించాలి.


నిర్మాణంలో ఉన్న సబ్‌-స్టేషన్లను మార్చి 1లోగా పూర్తిచేయాలి’’ అని సూచించారు. మూడేళ్లుగా సబ్‌-స్టేషన్లపై పెరుగుతున్న లోడ్‌ భారం వివరాలపైనా భట్టి సమీక్ష జరిపారు. బాగా పనిచేసే వారికి ప్రోత్సాహకంగా అవార్డులు ఇచ్చే విధానాన్ని ప్రారంభించాలన్నారు. ‘‘ఇటీవల భారీ వరదల సమయంలోనూ.. అర్ధరాత్రిళ్లు కూడా విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అలాంటి వారికి గుర్తింపునివ్వాలి. విద్యుత్తు రంగంలో వస్తున్న మార్పులపై అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించాలి. డయల్‌ 1912పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. అందుకోసం ఎస్సెమ్మెస్‌ ద్వారా ప్రచారం చేయాలి’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 12 , 2025 | 05:11 AM