Share News

Bhatti Vikramarka: పథకాల సమాచారం వెల్లడిస్తాం

ABN , Publish Date - Mar 16 , 2025 | 04:39 AM

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతామని, శాసన సభ ప్రాంగణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

Bhatti Vikramarka: పథకాల సమాచారం వెల్లడిస్తాం

సమగ్ర వివరాలతో ప్రజల ముందు ఉంచుతాం.. బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యా వ్యవస్థ నాశనం

  • ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం: భట్టి

  • ట్రోల్స్‌ చేసేవారిని మా కార్యకర్తలు చూసుకుంటారు: వెంకట్‌రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల సమగ్ర సమాచారాన్ని ప్రజల ముందు ఉంచుతామని, శాసన సభ ప్రాంగణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. శనివారం శాసన సభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు భట్టి కౌంటర్‌ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో వర్సిటీలు, విద్యా వ్యవస్థను గాలికొదిలేశారని మండిపడ్డారు. తాము 15 నెలల్లో 11 వేల మంది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేశామని, 12 మంది వీసీలను నియమించామని వెల్లడించారు. హాస్టల్‌ విద్యార్థులకు 40 శాతం డైట్‌ ఛార్జీలను, 200 శాతం కాస్మెటిక్‌ ఛార్జీలను పెంచామని తెలిపారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీని ప్రపంచంలోనే గొప్ప వర్సిటీగా తీర్చిదిద్దనున్నామని, రూ.15 కోట్లతో చారిత్రక భవనాలను పునరుద్ధరిస్తూ, రూ.540 కోట్లతో కొత్త భవనాలను కడుతున్నామని వెల్లడించారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 58 నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా గురుకులాలను కడుతున్నామని చెప్పారు. 2018లో రూ.లక్ష రుణమాఫీని ఐదు వాయిదాల్లో చేస్తే.. తాము రూ.2 లక్షలదాకా రుణమాఫీని ఏకకాలంలో చేశామని చెప్పారు. ప్రధానంగా విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 2018లో ఎంత రుణమాఫీ జరిగింది..? రూ.2 లక్షల దాకా రుణమాఫీ కింద తాము ఎంత మేలు చేశామనే అంశాన్ని గణాంకాలతో సహా వివరించారు. శాసనసభ ప్రాంగణంలో రైతు రుణమాఫీ, రైతు భరోసాకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకం వివరాలను లెక్కలతో సహా ఎమ్మెల్యేలకు ఇస్తామని భట్టి తెలిపారు.


జగదీశ్‌రెడ్డి హావభావాలు అహంకారపూరితం: శ్రీధర్‌బాబు

ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే అసెంబ్లీ ఎథిక్స్‌ కమిటీని ఏర్పాటు చేస్తామని శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. అసెంబ్లీలోని తన చాంబర్‌లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌రెడ్డి మాట్లాడిన రికార్డులను పరిశీలించామని.. ఆయన మాటతీరు, హావభావాలు అహంకారపూరితంగా ఉన్నాయని అన్నారు. అందుకే తమ సభ్యులు అభ్యంతరాలు తెలిపారని చెప్పారు. శాసన సభ సభ్యుడిపై అనర్హత వేటు అన్నది స్పీకర్‌ తీసుకునే నిర్ణయమని అన్నారు. కాగా, ఫార్ములా-ఈ రేసును హైదరాబాద్‌లో నిర్వహించడాన్ని తాము ఎన్నడూ తప్పు పట్టలేదని, రేసుకు చెల్లింపులు జరిపిన విధానాన్నే తప్పుబట్టామన్నారు. హైదరాబాద్‌లో జరగనున్న మిస్‌ వరల్డ్‌ పోటీలకు సంబంధించిన వివరాలను నిర్వాహకులు ఏప్రిల్‌ 19న ప్రకటిస్తారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న భారత్‌ సమ్మిట్‌.. ఏప్రిల్‌ నెలాఖరులో జరిగే అవకాశం ఉందన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీల కంటే మెరుగ్గా ప్రభుత్వ కాలేజీలను నడుపుతామని సభలో శ్రీధర్‌బాబు ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ సర్కారు ఐదేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో రూ.8 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేనప్పటికీ తాము ప్రణాళికాబద్ధంగా చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు.


విందులిచ్చి.. నీళ్లొదిలేశారు: ఉత్తమ్‌

బీఆర్‌ఎస్‌ చేతకానితన ం, అసమర్థత వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి శాసన సభలో విమర్శించారు. ప్రగతి భవన్‌లో విందులు చేసుకుని శ్రీశైలం నుంచి ఏపీకి నీటి తరలింపునకు అంగీకారం తెలిపారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం జరిగిందని, పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 88 వేల క్యూసెక్కులకు పెంచుకున్నారని విమర్శించారు. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయిస్తే.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 299 టీఎంసీలు తెలంగాణకు చాలని, 512 టీఎంసీలు ఏపీకి తీసుకెళ్లేలా సంతకాలు చేసింది ఎవరని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక కృష్ణా నీటి కోసం కృష్ణా ట్రైబ్యునల్‌లో న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పారు. బీఆర్‌ఎస్‌ సర్కారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎక్కడా బయటపెట్టలేదని వెల్లడించారు. తాము శాస్త్రీయంగా కులగణన చేశామని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామని ఉత్తమ్‌ వెల్లడించారు.


మేం చేసిన అప్పు 4,500 కోట్లే: వెంకట్‌రెడ్డి

సోషల్‌ మీడియాలో తమపై ట్రోల్స్‌ చేసేవారి సంగతి ఇకపై తమ కార్యకర్తలే చూసుకుంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. శ్రీశైలంలో చిన్న మాట దొర్లితే ఉద్దేశపూర్వకంగా తనను ట్రోల్‌ చేశారని చెప్పారు. ఆ రోజు తాను చిన్న సమోసా తప్ప ఏమీ తినలేదనీ వివరణ ఇచ్చారు. సీఎం రేవంత్‌ ప్రసంగంలో అప్పులు, వడ్డీ లెక్కలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారని అన్నారు. ఈ 15 నెలల్లో తాము చేసిన అప్పు రూ.4,500 కోట్లేనన్నారు. కాగా, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏకకాలంలో రూ.21 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని మంత్రి వెంకట్‌రెడ్డి సభలో మాట్లాడారు.

సోషల్‌ మీడియాకు కట్టడి అవసరం : సీతక్క

సోషల్‌ మీడియాకు కట్టడి అవసరమని మంత్రి సీతక్క అన్నారు. ఈ మీడియా ద్వారా బీఆర్‌ఎస్‌ చల్లిన బురదను కడుక్కోవడమే తమ వంతు అవుతోందన్నారు. మహిళలు రాజకీయాల్లో ఎదగడమే కష్టమని, అలాంటిది ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిన తమను సోషల్‌ మీడియా ద్వారా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. సోషల్‌ మీడియా ప్రభావంపై సీఎం రేవంత్‌రెడ్డి సభలో మాట్లాడటం తమకు ఎంతో ఊరట ఇచ్చిందన్నారు. సోషల్‌ మీడియాలో తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, మానసికంగా ఇబ్బంది పెట్టారని అన్నారు.


శ్రీధర్‌బాబు వస్తుంటే సీఎం వచ్చినంత హంగామా

మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీకి వస్తుంటే సీఎం వచ్చినంత హంగామా ఉంటోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సరదాగా వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి శ్రీధర్‌బాబు వచ్చిన సమయంలో మంత్రి కోమటిరెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన శ్రీధర్‌బాబుపై సరదా వ్యాఖ్య చేశారు. దీంతో అక్కడ ఉన్న అసెంబ్లీ సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా నవ్వారు. ‘వెంకన్న నాపై అభిమానంతో అలాగే అంటారు.. మీరు పట్టించుకోవద్దు..’ అని శ్రీధర్‌బాబు సరదాగా వారినుద్దేశించి అన్నారు.

Updated Date - Mar 16 , 2025 | 04:39 AM