55.85% బీసీలు!
ABN , Publish Date - Feb 02 , 2025 | 03:43 AM
రాష్ట్రంలోని మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85 శాతం ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. ఇందులో 42ు మంది హిందూ మతానికి చెందిన బీసీలు కాగా.. 13.85ు మంది మైనారిటీ, ఇతరులు ఉన్నారు.
కులగణన సర్వేలో వెల్లడి.. నేడు ఉపసంఘానికి నివేదిక
5న క్యాబినెట్, అసెంబ్లీ సమావేశం, బీసీ కోటాపై తీర్మానం
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85 శాతం ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. ఇందులో 42ు మంది హిందూ మతానికి చెందిన బీసీలు కాగా.. 13.85ు మంది మైనారిటీ, ఇతరులు ఉన్నారు. దీంతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. 1,450-1,500 పేజీలతో సర్వేకు సంబంధించిన వివరాలతో నివేదికను రూపొందించారు. సమగ్ర కుల సర్వే వివరాల నివేదికను ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేయనున్నారు. ఆ నివేదికపై ఉపసంఘం అధ్యయనం చేయనుంది. 5న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి, బీసీల రిజర్వేషన్లపై ఒక తీర్మానం చేసి.. దాన్ని కేంద్రానికి పంపనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ మేరకు బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు మించకుండా, న్యాయపరమైన సమస్యలు లేకుండా ఉండేలా ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కాగా, మార్చి 20 నాటికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను పూర్తిచేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిశగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యాచరణ చేపడుతోంది. కుల సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరనుండడంతో ఎన్నికల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బీసీ కమిషన్.. కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్..
తెలంగాణ ఏర్పాటైన తర్వాత అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సర్వే చేపట్టింది. దాని ప్రకారం 2014లో బీసీలు 51శాతం, ఓసీలు 21, ఎస్సీలు 18, ఎస్టీలు 10 శాతం ఉన్నట్టు తేలింది. కానీ, ఈ సర్వేను అధికారికంగా విడుదల చేయలేదు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇటీవల సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కులం, మతం సహా అన్ని వివరాలను సేకరించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో ఎంతమేర రిజర్వేషన్లను కల్పించాలనే అంశంపై ప్రభుత్వం ఈ సర్వేను వినియోగించుకోనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల ఖరారు కోసం సర్కారు బీసీ కమిషన్‌తో పాటు, ప్రత్యేక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసింది. ప్రత్యేక కమిషన్ కూడా బీసీల రిజర్వేషన్లపై లోతుగా అధ్యయనం చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిసింది. సర్వే వివరాలు, ప్రత్యేక కమిషన్ సూచనలను పరిగణనలోకి తీసుకొని.. స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై సర్కారు నిర్ణయం తీసుకోనుంది.
మంత్రులతో సీఎం భేటీ..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో భేటీ అయ్యారు. బీసీలకు రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై చర్చించారు. సమావేశం అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ మీడియాతో మాట్లాడారు. పొన్నం మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే, బీసీ కులగణనపై శాసనసభలో తీర్మానం చేసి, ప్రక్రియను పూర్తి చేశామని చెప్పారు. కులగణన కార్యరూపం దాల్చే అంశంపై సీఎం చర్చించారని తెలిపారు. దీంతోపాటు ఎస్సీ వర్గీకరణపై సబ్‌కమిటీ తీసుకున్న నిర్ణయాలపైనా చర్చించామన్నారు. ఈ నెల 5న సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను క్యాబినెట్ ముందు పెడుతున్నారని, అదే రోజుశాసనసభలో చర్చించి ప్రజాస్వామ్య యుతంగా ముందుకు తీసుకెళతామని చెప్పారు.
వర్గీకరణపై త్వరలో నివేదిక: రాజనర్సింహ
సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన రెండు గంటల్లోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో ప్రకటన చేశామని, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. దీనిపై ఇప్పటికే సానుకూలంగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి మంత్రివర్గ ఉపసంఘం వేశారన్నారు. ఉపసంఘం సూచన మేరకు ఏకసభ్య కమిషన్‌ను నియమించామని.. ఈ కమిషన్ త్వరలో నివేదిక ఇవ్వబోతోందని తెలిపారు. దానిపై మంత్రివర్గంలో చర్చించి, అసెంబ్లీలో ప్రవేశపెడతామని చెప్పారు.