BC Reservation: చట్టబద్ధత కల్పించి ఎన్నికలు నిర్వహించాలి
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:27 AM
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై చట్టభద్రత కల్పించి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని పలు బీసీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు.

42 శాతం రిజర్వేషన్లపై బీసీ మేధావులు
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై చట్టభద్రత కల్పించి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని పలు బీసీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించాలన్నారు. కులగణన సర్వే ఫలితాలను తక్షణం సమీక్షించి, పూర్తి పారదర్శకతతో వాస్తవ గణాంకాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. కులగణన సర్వే నివేదిక సమీక్ష, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు చట్టబద్ధత సాధించే లక్ష్యంతో ఆదివారం నగరంలోని ఓ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జసత్యం అధ్యక్షతన ఏర్పాటు చేసిన భేటీలో బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ సర్వేలో పారదర్శకత లోపించిందని, బీసీ జనాభా తగ్గించడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయకుండా పార్టీ పరంగా సీట్లు ఇస్తానని సీఎం ప్రకటించడం మోసం చేయడానికి ప్రయత్నించడమేనని తెలి పారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పేరిట బీసీల లెక్కలను తక్కువ చేసి చూపిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.