Share News

బీసీ కుల గణన ప్రత్యేకంగా చేపట్టాలి

ABN , Publish Date - Jan 20 , 2025 | 05:14 AM

దేశవ్యాప్తంగా జరిగే కుల గణనలో బీసీ కుల గణనను ప్రత్యేకంగా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్‌రావు డిమాండ్‌ చేశారు.

బీసీ కుల గణన ప్రత్యేకంగా చేపట్టాలి

  • జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలి

  • బీసీ సంక్షేమ సంఘం నేతలు శ్రీనివా్‌సగౌడ్‌, శంకర్‌రావు

జమ్మలమడుగు, జనవరి19(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా జరిగే కుల గణనలో బీసీ కుల గణనను ప్రత్యేకంగా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్‌రావు డిమాండ్‌ చేశారు. ఆదివారం కడప జిల్లా జమ్మలమడుగులో నియోజకవర్గస్థాయిలో బీసీ సంక్షేమ సంఘం ఆవిర్భావ సమావేశం జరిగింది. సమావేశానికి 22 సంఘాలకు చెందిన బీసీ నాయకులు హాజరయ్యారు. బీసీ కులాల లెక్కలు కేంద్రం చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ బాధ్యతలు తీసుకోవాలన్నారు.


దేశవ్యాప్తంగా జరిగే జాతి జన గణనలో బీసీ కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆ హామీని నిలబెట్టుకోవాలంటే జాతీయస్థాయిలో బీసీ కుల గణన జరిగితేనే ఇది సాధ్యమవుతుందని నేతలు తెలిపారు. నామినేటెడ్‌ పోస్టులలో, పాలన పదవుల్లో బీసీలకు 50 శాతం వాటా కల్పించాలని, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు.

Updated Date - Jan 20 , 2025 | 05:14 AM