BC Organizations: బీసీ జనాభాను తగ్గించి.. అవమానిస్తే సహించం
ABN , Publish Date - Feb 06 , 2025 | 03:27 AM
కులగణన సర్వే పేరిట బీసీ జనాభాను తగ్గించి చూపుతూ అవమానించే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని బీసీ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. కులగణన సర్వే నివేదికపై సమగ్రంగా చర్చించేందుకు సైతం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.
సర్కారుపై బీసీ సంఘాల ప్రతినిధుల ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): కులగణన సర్వే పేరిట బీసీ జనాభాను తగ్గించి చూపుతూ అవమానించే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని బీసీ సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు. కులగణన సర్వే నివేదికపై సమగ్రంగా చర్చించేందుకు సైతం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తప్పుల తడకగా ఉన్న బీసీ సర్వే నివేదికను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. 42% రిజర్వేషన్లు సాధ్యం కాని పక్షంలో పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
పోరాట కార్యాచరణకు బీసీలను సమన్వయం చేసేందుకు త్వరలో బీసీ కుల సంఘాల నేతలు, మేధావులు, కళాకారులతో సమావేశమవుతున్నట్లు పేర్కొన్నారు. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం కాకి లెక్కలతో కమిషన్‌ను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుందన్నారు. బీసీలకు న్యాయం జరగని పక్షంలో పోరాటమే శరణ్యమని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ అన్నారు. బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు మాట్లాడుతూ.. బీసీల జనాభా తగ్గించి చూపడంతో భవిష్యత్తులో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మాజీ మంత్రి హరీశ్ రావుకు భారీ ఊరట.. అప్పటివరకూ అరెస్టు చేయెుద్దంటూ ఆదేశాలు..
Hyderabad: వారి తప్పుడు ప్రచారాలను బీసీ ప్రజలు నమ్మెుద్దు: మహేశ్ కుమార్ గౌడ్..