Bandi Sanjay: మావోయిస్టులతో చర్చల ప్రసక్తేలేదు
ABN , Publish Date - May 05 , 2025 | 03:48 AM
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మావోయిస్టులు తుపాకీ వీడాల్సిందేనని, పోలీసులకు లొంగిపోవాల్సిందేనని అన్నారు.

తుపాకీ వీడాల్సిందే.. పోలీసులకు లొంగిపోవాల్సిందే
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
తుపాకీ వీడాల్సిందే.. పోలీసులకు లొంగిపోవాల్సిందే
నక్సల్‌కు సీఎం రేవంత్, కేసీఆర్ మద్దతు సరికాదు
వారిపై నిషేధం ఎత్తేసే దమ్ము రాష్ట్రానికి ఉందా..?
పాక్ పౌరులపై రాష్ట్ర సర్కారు నామమాత్ర చర్యలు
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, మే 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మావోయిస్టులు తుపాకీ వీడాల్సిందేనని, పోలీసులకు లొంగిపోవాల్సిందేనని అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహ ప్రారంభోత్సవం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల సమస్యను సామాజిక కోణంలో చూడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కగార్ ఆపాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మావోయిస్టులు బాంబులు పెట్టి పోలీసులు, రాజకీయ నాయకులను చంపుతుంటే సామాజిక కోణంలో చూడాలా..? అని ప్రశ్నించారు. మావోయిస్టులపై నిషేధం విధించింది కాంగ్రెస్ పాలకులేనని చెప్పారు. రాష్ట్రంలో మావోయిస్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా..? అని సవాల్ విసిరారు. మావోయిస్టులు తుపాకులు చేతిలో పట్టుకొని అమాయకులైన గిరిజనులు, పోలీసులను కాల్చి చంపుతున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ టీడీపీలో ఉన్న సమయంలో మావోయిస్టులు ఎంతో మంది నాయకులను చంపేశారని తెలిపారు.
గిరిజనులను, అమాయకులను ఇన్‌ఫార్మర్ల పేరుతో కాల్చి చంపుతుంటే సమర్థిస్తారా..? అని ప్రశ్నించారు. పాకిస్తాన్ పౌరులను తిరిగే పంపే అంశంపై కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిందని, దేశమంతా దీనిపై సీరియ్‌సగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకోవడం సరికాదని విమర్శించారు. ఇప్పటికే చాలా మంది పాస్‌పోర్టు, వీసాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. రోహింగ్యాలు కూడా చాలా మంది ఉన్నారని, వారిపై కాంగ్రెస్ వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. దీనిని శాంతి భద్రతల సమస్యగా చూడాలే తప్ప మత కోణంలో, రాజకీయ లబ్ధి కోసం చూస్తే హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారే ప్రమాదముందని అన్నారు. కాళేశ్వరంపై ఎన్డీఎ్‌సఏ నివేదిక ఇచ్చి వారం రోజులైనా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయం చరిత్రాత్మకమని, దీనిని కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణనకు పొంతనే ఉండదని చెప్పారు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. 52 శాతం జనాభా ఉన్న బీసీలను 46 శాతంగా చూపారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని చెప్పి అందులో పది శాతం ముస్లింలకు కేటాయించారని సంజయ్ మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..