Bandi Sanjay: హిందూ సమాజాన్ని చీల్చేందుకే ‘మార్వాడీ గో బ్యాక్’ కుట్ర!
ABN , Publish Date - Aug 16 , 2025 | 04:02 AM
మర్వాడీ గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు.
కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ డ్రామాలివి
పాతబస్తీని రోహింగ్యాలు ఐఎ్‌సఐ అడ్డాగా మార్చారు.. వారిపై మాట్లాడరేం?
మటన్, డ్రై క్లీనింగ్ షాపులు ఒక వర్గం వారే నిర్వహిస్తుంటే నోరు మెదపరా?
రోహింగ్యాల గో బ్యాక్ అంటూ మేం ఉద్యమం చేస్తాం: బండి సంజయ్
యూసు్‌ఫగూడ/హైదరాబాద్ సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): మర్వాడీ గో బ్యాక్ పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని ప్రశ్నించారు. హిందూ సనాతన ధర్మం పరిరక్షణకు మార్వాడీలు పాటుపడుతున్నారని చెప్పారు. మార్వాడీలు రాష్ట్రాన్ని దోచుకోలేదని, ఎన్నడూ అధికారం కోసం పాకులాడలేదని, వ్యాపారాలతో సంపద సృష్టించారని.. అలాంటిది వారు ఎందుకు తెలంగాణ నుంచి వెళ్లిపోవాలి? అని ప్రశ్నించారు. మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఓ వర్గం వారే నిర్వహిస్తూ హిందూ కుల పుత్రులను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలు పాతబస్తీని ఐఎ్‌సఐ అడ్డాగా మార్చారని.. వారి గురించి ప్రశ్నించకుండా.. ఈ దేశానికే చెందిన మార్వాడీల గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్. ‘మార్వాడీ గోబ్యాక్’ ఉద్యమాలు చేస్తే.. హిందు కులపుత్రులను కాపాడుకునేందుకు, అలాగే రోహింగ్యాలకు వ్యతిరేకంగా రోహింగ్యాల గోబ్యాక్ ఉద్యమం చేస్తామని చెప్పారు.
హైదరాబాద్ యూసు్‌ఫగూడలో శుక్రవారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా ర్యాలీ’ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావుతో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా వెనుక రామచందర్‌రావును కూర్చోబెట్టుకుని బండి సంజయ్ బులెట్ నడిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మటన్ ఎవరు కొట్టాలి? హిందువులైన కటికోళ్లు కొట్టాలి. రజకులు బట్టలుతుకుతారు. కానీ ఇక్కడేం జరుగుతోంది? నయీం మటన్ షాపు, సలీం డ్రైక్లీనింగ్ షాపులు పెడుతున్నారు. దీనిపై ఎవ్వరూ స్పందించడం లేదు’’ అని బండి వ్యాఖ్యానించారు. ‘మార్వాడీ గోబ్యాక్’ అనేది కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ కలిసి ఆడుతున్న నాటకం అని విమర్శించారు. కాగా జాబితాలోంచి ఓట్లను తొలగించడం, చేర్చడం అనేది ఎన్నికల సంఘం పని అని.. దాంతో బీజేపీకి ఏ సంబంధం? అని ప్రశ్నించారు. నిజానికి ‘ఓట్ల చోరీ’ బీజేపీ చేతుల్లోనే ఉంటే పార్టీకి 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయి? అన్ని సీట్లలోనూ గెలిచివేళ్లం కదా? తెలంగాణ, కర్ణాటకలో కూడా బీజేపీయే అధికారంలోకి వచ్చేది కదా? అని ప్రశ్నించారు. ‘‘మీరు గెలిస్తే ప్రజాస్వామ్యం.. ఓడిపోతే ఓట్ల చోరీ జరిగినట్లా?’’ అని కాంగ్రె్‌సను నిలదీశారు.