Bandi Sanjay: టీటీడీలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు!
ABN , Publish Date - Jul 12 , 2025 | 04:27 AM
టీటీడీలో ఇప్పటికీ వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉద్యోగాల్లో ఉన్నారని. వెంటనే వారిని తొలగించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు.
వారిని తక్షణం తొలగించండి: బండి సంజయ్
తిరుమల, జూలై 11(ఆంధ్రజ్యోతి): టీటీడీలో ఇప్పటికీ వెయ్యి మందికి పైగా అన్యమతస్థులు ఉద్యోగాల్లో ఉన్నారని. వెంటనే వారిని తొలగించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డితో కలిసి ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘టీటీడీలో ఉన్న అన్యమతస్థులకు స్వామిపై విశ్వాసం లేదు. సనాతన ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలనే ఆలోచన వారికి లేదు.
అలాంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం, వారిని ఇంకా కొనసాగించడం సరికాదు. జీతాలు ఇస్తూ వారిని ఎలా ప్రోత్సహిస్తారు. గతం నుంచి ఉన్నారు, మేము ఏమీ చేయలేం అంటే అది చేతగానితనం అవుతుంది. టీటీడీ బోర్డుకు నేను సూటిగా చెప్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. వారిని వెంటనే తొలగించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఇది రిక్వెస్ట్ కాదు, డిమాండ్’ అని సంజయ్ స్పష్టంచేశారు. హిందువుల ఆస్తి టీటీడీ, నామం పెట్టుకుని చర్చికి వెళితే ఉద్యోగమిస్తారా అని ఆయన ప్రశ్నించారు.