Share News

Bandi Sanjay: టెన్త్‌ విద్యార్థులకు ఏమిటీ ‘పరీక్ష’..?

ABN , Publish Date - Mar 02 , 2025 | 03:55 AM

రంజాన్‌ మాసం నేపథ్యంలో 6 నుంచి నిర్వహించే పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: టెన్త్‌ విద్యార్థులకు ఏమిటీ ‘పరీక్ష’..?

  • భోజన విరామ సమయంలో పెట్టడమేంటి

  • ఒక వర్గం కోసం పిల్లల కడుపు మాడ్చుతారా..?: బండి సంజయ్‌

హైదరాబాద్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): రంజాన్‌ మాసం నేపథ్యంలో 6 నుంచి నిర్వహించే పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలను మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం చేసే వేళలో పరీక్షలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. తక్షణమే ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకోవాలని.. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా పరీక్షల వేళలను మార్చాలని డిమాండ్‌ చేశారు. ‘‘రంజాన్‌ సందర్భంగా ముస్లింలకు సాయంత్రం 4 గంటల తర్వాత విధుల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. పాఠశాలల వేళలు సైతం ఉదయం 9.15 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.15 గంటలకు ముగుస్తాయి.


అయినప్పటికీ మళ్లీ రంజాన్‌ పేరుతో వేళాపాళా లేకుండా పరీక్షలు నిర్వహించి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం ఏంటి..? ఒక వర్గం వారిని మెప్పించేందుకు విద్యార్థుల కడుపు మాడ్చటం న్యాయమా? శివరాత్రి సందర్భంగా హిందువులంతా ఉపవాసం, జాగరణ చేస్తారు. మరుసటి రోజు విశ్రాంతి తీసుకుంటారు. వారికి సర్కారు కనీసం ఆప్షనల్‌ హాలిడే కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకం’’ అని సంజయ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Mar 02 , 2025 | 03:55 AM