Share News

Bandi Sanjay: ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్‌ ధర్నా

ABN , Publish Date - Aug 07 , 2025 | 05:04 AM

ముస్లింలకు 10ు రిజర్వేషన్లు కల్పించేందుకే కాంగ్రెస్‌ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: ముస్లిం రిజర్వేషన్ల కోసమే కాంగ్రెస్‌ ధర్నా

  • బీసీలపై ఆ పార్టీది మొసలి కన్నీరు

  • హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర: సంజయ్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ముస్లింలకు 10ు రిజర్వేషన్లు కల్పించేందుకే కాంగ్రెస్‌ జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. బీసీలకు న్యాయం చేయాలన్న నిజాయితీ లేదని, బీసీలపై ఆ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ధర్నాకు సోనియా, ఖర్గే, రాహుల్‌ రాలేదని, వాళ్ల కార్యక్రమం ఫ్లాప్‌ షోగా సాగిందన్నారు. మోదీ ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 27% రిజర్వేషన్లు అమలు చేస్తోందని చెప్పారు. 42ు రిజర్వేషన్లలో ముస్లింలకు 10% కల్పిస్తే.. బీసీలకు అదనంగా వచ్చేది 5ు మాత్రమేనని, పక్కా ప్లాన్‌ ప్రకారమే మెజారిటీ హిందువులను మైనారిటీలుగా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాము మతపరమైన రిజర్వేషన్లకు విరుద్ధమని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లుగా బీసీలకే పూర్తిగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటే తాము బిల్లుకు మద్దతు ఇస్తామని, లేకపోతే తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పారు.


దేశాన్ని 50 ఏళ్ల పాటు ఏలిన కాంగ్రెస్‌ ప్రధానమంత్రి పదవిని బిసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో బూర్గుల నుంచి నేటి తెలంగాణలో రేవంత్‌ రెడ్డి వరకు ఒక్కరినైనా బీసీని ముఖ్యమంత్రిని చేసిందా అని నిలదీశారు. ఒక బీసీని ప్రధానిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని, కేంద్రంలో 27 మంది బీసీలకు మంత్రిపదవులు ఇచ్చామని, పలు రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులను నియమించామని తెలిపారు. తెలంగాణలో సగం జనాభా బీసీలు ఉంటే రాష్ట్ర క్యాబినెట్‌లో సగం మంది బీసీలకు ఎందుకు అవకాశా లివ్వలేదని నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్‌ లేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలు లేకుండా బీసీలకే 42ు రిజర్వేషన్లను కల్పిస్తారా? అని అసెంబ్లీలో తాము అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్‌ సమాధానమివ్వలేదని తెలిపారు.

Updated Date - Aug 07 , 2025 | 05:04 AM