Share News

Bandi Sanjay: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తథ్యం: సంజయ్‌

ABN , Publish Date - Feb 20 , 2025 | 04:00 AM

పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తథ్యం: సంజయ్‌

భగత్‌నగర్‌ (కరీంనగర్‌), ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం తథ్యమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ అన్నారు. కరీంనగర్‌లో తపస్‌ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, పది సీట్లలో ఉప ఎన్నికలు వస్తే ఏడిట్లో బీజేపీ గెలవడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దొందూ దొందే అని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి సమావేశాలు రహస్యంగా జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వానికి నూకలు చెల్లబోతున్నాయని, ఎప్పుడు ఊడుతుంతో తెలియని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కులగణన పేరుతో 60 లక్షల మంది బీసీలను తగ్గించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హిందూ జాతిలో ముస్లింలను ఎలా కలుపుతారని ప్రశ్నించారు.


ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ ఇస్తేనే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీలు గెలవాల్సిన చోట ఎంఐఎం గెలిచిందని, పది శాతం ఇస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగ, ఉపాధ్యాయులు జీతాల కోసం అడుక్కునే పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. దాచుకున్న జీపీఎఫ్‌ సొమ్మును కూడా ప్రభుత్వం ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించారు. అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం పీఆర్సీ సహా ఏ సమస్యనూ పరిష్కరించలేదని విమర్శించారు. రాష్ట్ర క్యాబినెట్‌లో నలుగురు మంత్రులకు సంబంధించిన బిల్లులు మాత్రమే క్లియర్‌ అవుతున్నాయని సంజయ్‌ ఆరోపించారు.

Updated Date - Feb 20 , 2025 | 04:00 AM