Share News

Bandi Sanjay: ఎకరానికి 12 వేలే ఇస్తామనడం దుర్మార్గం

ABN , Publish Date - Jan 05 , 2025 | 03:34 AM

భరోసా పేరుతో రైతులకు ఎకరాకు రూ.12వేలే ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం అన్నదాతలను దగా చేయడమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

Bandi Sanjay: ఎకరానికి 12 వేలే ఇస్తామనడం దుర్మార్గం

  • రైతు భరోసాపై కాంగ్రెస్‌ దగా: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, జనవరి4(ఆంధ్రజ్యోతి): భరోసా పేరుతో రైతులకు ఎకరాకు రూ.12వేలే ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం అన్నదాతలను దగా చేయడమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ప్రజలను దారుణంగా మోసం చేయడం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభయ హస్తం పేరుతో ప్రకటించిన మ్యానిఫెస్టోలో ప్రతి రైతుకు, కౌలు రైతుకు ఎకరానికి రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.


గతంతో పోలిస్తే కాంగ్రెస్‌ పాలనలో రైతులు ఎకరాకు మరో రూ.2 వేలు నష్టపోయినట్లయిందన్నారు. భరోసా మొత్తాన్ని ఎంతమంది రైతులకు చెల్లిస్తారో ప్రకటించకపోవడం విడ్డూరమని సంజయ్‌ చెప్పారు. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్లుగా వెంటనే రూ.15 వేలు ఇవ్వకపోతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాయకత్వంలో ఉద్యమం చేసి, ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఓట్ల కోసం అందరినీ వాడుకుని, అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

Updated Date - Jan 05 , 2025 | 03:34 AM