Bandi Sanjay: ఆపరేషన్ కగార్ ఎందుకు ఎత్తేయాలి?: సంజయ్
ABN , Publish Date - Aug 17 , 2025 | 05:17 AM
గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించింది? ఆపరేషన్ కగార్‌ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం.
భగత్‌నగర్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ‘‘గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించింది? ఆపరేషన్ కగార్‌ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం. ఆపరేషన్ కగార్‌ను ఎందుకు ఎత్తివేయాలి’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. కరీంనగర్‌లో శనివారం ఏబీవీపీ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ’నక్సల్స్ నరమేధం-మేధోమథనం‘ అన్న అంశంపై చర్చలో సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అధికారంలో ఉన్నంత కాలం నక్సలైట్లపై నిషేధం విధించిన కేసీఆర్ అధికారం పోగానే చర్చలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. నక్సలైట్ల సమస్య సామాజిక కోణంగా చూడాలని పౌర హక్కులు, మానవ హక్కుల సంఘం నేతలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు.
నక్సలైట్ల చేతిలో వేలాది మంది అమాయక ప్రజలు చనిపోయినప్పుడు సామాజిక కోణం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. నక్సల్స్ దురాగతాలవల్ల దాదాపు 50 వేల మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 9 వేల మంది పోలీసులు నక్సల్స్ తూటాలకు బలయ్యారన్నారు. ఆపరేషన్ కగార్‌ను ఆపే ప్రసక్తే లేదని, నక్సలైట్లను ఏరిపారేసే కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి ’నక్సల్ ముక్ ్తభారత్‘గా చేయడమే తమ ధ్యేయమని ఆయన ప్రకటించారు.