Share News

Bandi Sanjay: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి

ABN , Publish Date - Feb 21 , 2025 | 04:37 AM

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని టాప్‌-5 మంత్రులు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.

Bandi Sanjay: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి

  • ఆరు గ్యారెంటీలపై ప్రజలు నిలదీస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి వారిది

  • రహస్య సమావేశం జరిపిన ఎమ్మెల్యేలు

  • రాష్ట్రంలో ఎప్పుడైనా, ఏమైనా జరగొచ్చు!!

  • కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని టాప్‌-5 మంత్రులు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు. ఆరు గ్యారెంటీలపై ప్రజలు నిలదీస్తుంటే ఏం చెప్పాలో అర్థంగాక, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం పెట్టుకున్నారని చెప్పారు. ఈ ప్రభుత్వం ఐదేళ్లూ ఉండాలని కోరుకుంటున్నామని.. అయితే, ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వారం పదిరోజుల కిందట జరిగిన హోటల్‌ మీటింగే కాదు.. నిన్నగాక మొన్న ఫాంహౌ్‌సలో కూడా పది మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారట’ అని సంజయ్‌ చెప్పారు. కృష్ణా జలాల వాటాలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అని మండిపడ్డారు. కృష్ణా జలాల్లో మన వాటా 575 టీఎంసీలైతే, 299 టీఎంసీలకే ఎందుకు ఒప్పుకొన్నారని నాడు ప్రశ్నిస్తే అప్పటి సీఎం కేసీఆర్‌ ఇప్పటివరకూ జవాబు చెప్పలేదన్నారు. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేసిన తొలి ద్రోహి కేసీఆర్‌ అని సంజయ్‌ ఆరోపించారు. నాటి ఏపీ సీఎం జగన్‌ను ఆలింగనం చేసుకుని, చేపల పులుసు తినిపించి, తెలంగాణ ప్రజల కొంప ముంచారని విమర్శించారు.


గురువారమిక్కడ ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్‌ మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. అసభ్య పదజాలంతో మోదీని అవమానిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ సర్కారు గ్రాఫ్‌ పడిపోయిందని, తామే అధికారంలోకి వస్తామంటూ కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యపై స్పందిస్తూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆ పార్టీకి అభ్యర్థుల్లేరని సంజయ్‌ ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కేసులో విజిలెన్స్‌ నివేదిక వచ్చినా కేసీఆర్‌ కుటుంబాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ఏ కేసుల్లోనూ చర్యలు తీసుకోకపోవడానికి కారణం.. బీఆర్‌ఎస్‌ ముఖ్యులు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పెద్దలతో లాలూచీ పడడమేనని చెప్పారు. ‘బీజేపీని అడ్డుకోవాలంటే మీరూ, మేం కలిసి ఉండాలె. అందుకే మాపై కేసులు పెట్టొద్దు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేం అభ్యర్థులను పెట్టం. ప్రత్యక్షంగా, పరోక్షంగా మీకు సహకరిస్తాం’ అని కాంగ్రె్‌సకు బీఆర్‌ఎస్‌ ముఖ్యులు హామీ ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కాంగ్రెస్‌ నిధులు ఇస్తుంటే, కాంగ్రె్‌సకు ఓటు వేయాలని బీఆర్‌ఎస్‌ చెబుతోందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌ స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 10 శాతం ముస్లింలను తీసేస్తే బీసీలకు మిగిలేది 32 శాతమేనని గుర్తుచేశారు.


కేంద్ర బడ్జెట్‌లో 1.08 లక్షల కోట్లు

కేంద్ర బడ్జెట్‌లో పన్నులు, పథకాల రూపంలో తెలంగాణకు రూ.1.08 లక్షల కోట్లు కేటాయించినట్లు సంజయ్‌ తెలిపారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందనడం పచ్చి అబద్ధమన్నారు. 6 గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గ్రామాలు, పట్టణాల వారీగా కేంద్రం ఏం చేసిందో, రాష్ట్రం ఏం చేసిందో చర్చించడానికి సిద్ధమా? అని సవాల్‌ చేశారు. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ ఉంటే ఎలా ఉంటుందనడానికి ఏపీ ఉదాహరణ అని సంజయ్‌ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, తెలంగాణలో అధికారంలో లేకున్నా, ప్రజలు మెచ్చేలా కేంద్రం నిధులు కేటాయించిందని తెలిపారు. కాగా, సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్యపై విచారణ జరిపి నిజాయతీ నిరూపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందని సంజయ్‌ అన్నారు. హతుడి భార్య చేస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 21 , 2025 | 04:37 AM