Bandi Sanjay: కులగణన పేరిట బోగస్ సర్వే
ABN , Publish Date - Feb 13 , 2025 | 03:21 AM
కులగణన పేరిట రాష్ట్ర ప్రభుత్వం బోగస్ సర్వే నిర్వహించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆధార్ కార్డులను లింక్ చేస్తూ.. ఇంటింటా రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు.

ఇంటింటా రీ సర్వే చేపట్టాల్సిందే.. గ్రామసభల ఆమోదం పొందాల్సిందే
బీసీల్లో ముస్లింలను చేరిస్తే ఊరుకోం
బీసీల సంఖ్య తగ్గించడం వెనుక కుట్ర
కులగణనపై కాంగ్రెస్ నేతల్లోనే విబేధాలు
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కులగణన పేరిట రాష్ట్ర ప్రభుత్వం బోగస్ సర్వే నిర్వహించిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆధార్ కార్డులను లింక్ చేస్తూ.. ఇంటింటా రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. అలా సర్వే పూర్తయిన వెంటనే పంచాయతీల్లో ముసాయిదా జాబితాను ప్రదర్శించి.. అభ్యంత రాలను స్వీకరించాలని సూచించారు. గ్రామ సభలు, వార్డు సభల ఆమోదంతోనే తుది జాబితాను ప్రకటించాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే శాస్ర్తీయ పద్ధతిలో కులగణన జరిగినట్లుగా భావిస్తామని తెలిపారు. అలాకాకుండా రాజకీయ ప్రయోజనాలు, ప్రచారం కోసం తూతూ మంత్రంగా సర్వే చేయడం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని హితవు పలికారు.
ఈ మేరకు బుధవారం ఆయన కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ హెచ్చరించారు. బీసీ సామాజికవర్గ జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించే కుట్ర చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కుల గణన విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్యే ఏకాభిప్రాయం కొరవడిందని పేర్కొన్నారు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని సొంత పార్టీ వాళ్లే తప్పు పడుతుండగా, దాన్ని సరిదిద్దుకోకుండా కేంద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణలో 3.95కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉండగా.. సర్వేలో తెలంగాణ జనాభా 3.70కోట్లుగా చూపించడం ఏంటని నిలదీశారు. కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ రీ సర్వే చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.