Mulugu: తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి శ్రీకాంత్ రెడ్డిపై దాడి పట్ల వెల్లువెత్తిన నిరసన
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:06 AM
ములుగు జిల్లా తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి చల్లంకొండ శ్రీకాంత్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు, మంత్రి సీతక్క అనుచరుల దాడిని జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి.
ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పాత్రికేయుల ర్యాలీలు, రాస్తారోకోలు
వరంగల్‌లో ధర్నా, నిరసన
ములుగుటౌన్/ ములుగు/ భూపాలపల్లి/ వరంగల్ కార్పొరేషన్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ములుగు జిల్లా తాడ్వాయి ఆంధ్రజ్యోతి విలేకరి చల్లంకొండ శ్రీకాంత్‌రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు, మంత్రి సీతక్క అనుచరుల దాడిని జర్నలిస్టు సంఘాలు, ప్రజాసంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. ములు గు, భూపాలపల్లి జిల్లాలతోపాటు వరంగల్ నగర కార్పొరేషన్ పరిధిలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీలు, రాస్తారోకోలతో బుధవారం జర్నలిస్టులు చేపట్టిన నిరసన హోరెత్తింది. ములుగు జిల్లాలో తొమ్మిది, భూపాలపల్లి జిల్లాలో 3 మండలాల్లో విలేకరులు ఆందోళన చేశారు. ములుగు కలెక్టరేట్ వద్ద ధర్నా చేసిన జర్నలిస్టులు.. శ్రీకాంత్‌రెడ్డిపై దాడి చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టీ.ఎస్. దివాకరకు వినతి పత్రం అందజేశారు. ఏటూరు నాగారం బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసిన విలేకరులు ఏఎస్పీ కార్యాలయం వరకూ బైక్ ర్యాలీగా వెళ్లి ఏఎస్పీ శివం ఉపాధ్యాయకు వినతి పత్రం అందజేశారు. దుండగులపై చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. వరంగల్ తూర్పు జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జిలతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి బయలుదేరిన విలేకరుల ప్రదర్శన.. ఎంజీఎం జంక్షన్‌లో ధర్నాగా మారింది.
దాడిని ఖండించిన మంత్రి సీతక్క
విలేకరి శ్రీకాంత్‌రెడ్డిపై జరిగిన దాడిని మంత్రి సీతక్క ఖండించారు. దాడి సంగతి తెలియగానే జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడానన్న సీతక్క.. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్య తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. బాధిత విలేకరికి అన్ని విధాల సాయమందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించామన్నారు. విలేకరుల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు ఆమె తెలిపారు. శ్రీకాంత్‌రెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర తెలిపారు.