Sangareddy: భర్త ఎదుటే భార్యపై అత్యాచారం
ABN , Publish Date - Feb 16 , 2025 | 04:38 AM
దేవుడి మొక్కు తీర్చుకుని కాలినడకన ఇంటికి తిరిగొస్తూ మార్గమధ్యలో ఓ చెట్టు కింద భర్తతో కలిసి నిద్రిస్తున్న వివాహితపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
గిరిజన మహిళపై తమిళనాడు వాసి దుశ్చర్య
అడ్డుకోబోయిన బాధితురాలి భర్తపై దాడి
సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాదిలో దారుణం
సంగారెడ్డి క్రైం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): దేవుడి మొక్కు తీర్చుకుని కాలినడకన ఇంటికి తిరిగొస్తూ మార్గమధ్యలో ఓ చెట్టు కింద భర్తతో కలిసి నిద్రిస్తున్న వివాహితపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన ఆమె భర్తను కొట్టి అతని కళ్ల ముందే దుశ్చర్యకు తెగబడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాదిలో శుక్రవారం అర్ధరాత్రి ఈ దారుణం ఘటన జరగ్గా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సంగారెడ్డి రూరల్ ఎస్‌ఐ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ఓ తండాకు చెందిన దంపతులు సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా మొక్కులు చెల్లించడానికి ఈ నెల 2న తమ స్వగ్రామం నుంచి అనంతపురం జిల్లా నేరడిగొండకు కాలినడకన వెళ్లారు. అక్కడ మొక్కులు చెల్లించిన తర్వాత కాలినడకన ఇంటికి తిరుగు ప్రయాణమైన ఆ దంపతులు శుక్రవారం రాత్రికి సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాది గ్రామానికి చేరుకున్నారు.
ఫసల్‌వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో భోజనం చేసి పక్కనే ఉన్న ఓ చెట్టు కింద నిద్రపోయారు. అయితే, నిర్మాణంలో ఉన్న విద్యాపీఠం ఆలయంలో పెయింటింగ్ పనులు చేస్తున్న తమిళనాడుకు చెందిన మాథవన్ (34) సదరు వివాహితపై కన్నేశాడు. అర్ధరాత్రి సమయంలో భర్త కళ్ల ముందే ఆమెపై అత్యాచారం చేశారు. అడ్డుకోబోయిన భర్తను రాయితో కొట్టి గాయపరిచాడు. నిందితుడి నుంచి తప్పించుకున్న భర్త 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు నిందితుడు మాథవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నేరం అంగీకరించడంతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.