ATA to Conduct Service Programs: సేవా కార్యక్రమాలు.. సెమినార్లు
ABN , Publish Date - Dec 12 , 2025 | 04:27 AM
అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో శుక్రవారం (12వ తేదీ) నుంచి ఈ నెల 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు......
తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 27 వరకు ఆటా కార్యక్రమాలు
విద్యార్థులకు ఉపకారవేతనాలు, వైద్య శిబిరాల నిర్వహణ
ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీ్‌షరెడ్డి వెల్లడి
‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణతో భేటీ
హైదరాబాద్, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో శుక్రవారం (12వ తేదీ) నుంచి ఈ నెల 27 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీ్‌షరెడ్డి రామసహాయం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తామని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 13న ఐఐటీ హైదరాబాద్‌లో సెమినార్, స్టార్టప్ పిచ్ పోటీలు, 14న ఎస్‌పీఆర్ యూనివర్సిటీలో సాహిత్య కార్యక్రమం, 15న ఆటా బృందం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దర్శనం ఉంటాయని వెల్లడించారు. 16, 17 తేదీలలో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖలో బిజినెస్ సెమినార్లు, విద్యా పరమైన చర్చలు ఉంటాయని, 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో యువజన, క్రీడా కార్యక్రమాలు, 21న మహబూబాబాద్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, మడ్డిగడ్డ గ్రామంలో 22న చిన్నారుల కోసం విద్య, ఆధ్యాత్మిక, వైద్య పరమైన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. 23న నాగర్‌కర్నూల్ జిల్లా మెడిపూర్ గ్రామంలో మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక సెమినార్, హెల్త్ క్యాంపు ఉంటుందని, 24న సూర్యాపేట జిల్లా అనంతారంలో వైద్య ఆరోగ్య శిబిరం, ఆలయ ప్రారంభోత్సవం ఉంటుందని వివరించారు. 25న సిద్దిపేటలో ‘నిషాంత్ బాలసదన్’ చారిటీ కార్యక్రమం, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట జిల్లాపరిషత్ పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. 27న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆటా గ్రాండ్ ఫినాలే ఉంటుందని వివరించారు.
‘ఆంధ్రజ్యోతి’ ఎండీ రాధాకృష్ణతో భేటీ
జయంత్ చల్లా, సతీ్‌షరెడ్డి రామసహాయం గురువారం ‘ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను కలిసి తమ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు, తెలుగువారిపై వాటి ప్రభావం, హెచ్-1బీ వీసాల గురించి చర్చించారు. వీరు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కూడా కలిసి అమెరికాలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో వచ్చే ఏడాది జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరుగనున్న ఆటా 19వ మహాసభలు, యువజన సదస్సుకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ నెల 19న హైదరాబాద్ టీ-హబ్‌లో నిర్వహించే బిజినెస్ సెమినార్‌లో పాల్గొనాలని కోరారు. మంత్రిని కలిసినవారిలో ఆటా మీడియా కోఆర్డినేటర్ ఈశ్వర్ బండా కూడా ఉన్నారు.