Cement Factory: మూసివేతకు చేరువలో మంచిర్యాల సిమెంట్ కంపెనీ
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:32 AM
రాష్ట్రంలో మరో సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేతకు సిద్ధమవుతోంది. మంచిర్యాల పట్టణ సమీపంలోని మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ) పీకల్లోతు నష్టాలు, అప్పులతో సతమతమవుతోంది.

పేరుకుపోతున్న నష్టాలు, అప్పులు
హైదరాబాద్ (ఆంరఽధజ్యోతి బిజినెస్): రాష్ట్రంలో మరో సిమెంట్ ఫ్యాక్టరీ మూసివేతకు సిద్ధమవుతోంది. మంచిర్యాల పట్టణ సమీపంలోని మంచిర్యాల సిమెంట్ కంపెనీ (ఎంసీసీ) పీకల్లోతు నష్టాలు, అప్పులతో సతమతమవుతోంది. దీంతో ఫ్యాక్టరీకి అప్పులిచ్చిన ఒక బ్యాంకు తనకు రావాల్సిన రూ.100 కోట్లు రాబట్టుకునేందుకు ఇప్పటికే అనేక సార్లు వేలం పెట్టింది. అయితే ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎలాగోలా నెట్టుకొస్తోంది. హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారి మీద మంచిర్యాల పట్టణానికి చేరువలో 350 ఎకరాల్లో 1958లో రోజుకు 1,000 ట న్నుల సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యంతో అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీస్ (ఏసీసీ) ఈ ప్లాంటును ఏర్పాటు చేసింది.
ఒకప్పుడు దాదాపు 1,000 మంది కార్మికులతో కళకళలాడేది. నాణ్యత బాగుండడంతో ఈ ప్లాంటు లో ఉత్పత్తి అయిన సిమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో నాగార్జున సాగర్, శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుల నిర్మాణంలోనూ వినియోగించారు. దేశంలోని వివిధ సముద్రజలాల్లో చమురు, సహజవాయువుల ఉత్పత్తి కోసం తవ్విన బావుల సిమెంటింగ్ కోసం ఈ ప్లాంటు సిమెంట్‌ను ఉపయోగించేవారు. 2000 నుంచి ఎంసీసీ నష్టాల్లో కూరుకుపోయింది. దాంతో 2006లో ఏసీసీ నుంచి కొంతమంది స్థానిక వ్యాపారులు ఈ ప్లాంటును కొన్నారు. వీరి కుమ్ములాటలతో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారింది.