Anganwadi: అంగన్‌వాడీ కేంద్రాలకు టేబుళ్ల సరఫరా టెండర్ల రద్దు
ABN , Publish Date - May 13 , 2025 | 05:21 AM
అంగన్‌వాడీ కేంద్రాలకు టేబుళ్ల సరఫరా కోసం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆధ్వర్యంలో జారీ చేసిన టెండర్లను సోమవారం రద్దు చేశారు. రాష్ట్రంలో 35,781 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.
గుడ్లు, కందిపప్పు, ‘ఎగ్ ర్యాక్’ సరఫరా టెండర్లలోనూ అధికారుల నిర్లక్ష్యం
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాలకు టేబుళ్ల సరఫరా కోసం మహిళా శిశు సంక్షేమ శాఖలో ఆధ్వర్యంలో జారీ చేసిన టెండర్లను సోమవారం రద్దు చేశారు. రాష్ట్రంలో 35,781 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఒక్కో టేబుల్‌కు ప్రభుత్వం రూ.4 వేల చొప్పున ధర నిర్ణయించగా రూ.28 కోట్ల అంచనా వ్యయంతో 70 వేల టేబుళ్ల సరఫరాకు అధికారులు గత నెల 23న ప్రకటన జారీ చేశారు. అయితే, ప్రకటనలోని నిబంధనలను నాలుగు సార్లు మార్పు చేశారు. ఈ నెల 9న ఒంటి గంట వరకు ఇ- ప్రొక్యూర్‌మెంట్ ద్వారా కొటేషన్లు కోరారు. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరిచి.. ఫైనాన్షియల్ బిడ్‌ను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం పైనాన్షియల్ బిడ్ ఓపెన్ చేస్తారని గుత్తేదారులు కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న తర్వాత వాయిదా వేసినట్లు ప్రకటించారు. అనంతరం సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో టెండర్‌ను రద్దు చేసినట్లు కమిషనర్ క్రాంతి వెస్లీ ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. అయితే.. టెక్నికల్ బిడ్‌లో ఎవరు ఎంత కోట్ చేశారనేది అధికారులకు ముందే తెలియడంతో వాళ్లకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు టెండర్ దక్కలేదనే ఉద్దేశంతోనే రద్దు చేశారని తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ర్టీస్ అసోషియేషన్ నాయకులు విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
ఎగ్ ర్యాక్‌ల సరఫరాలో జాప్యం
అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లను నిల్వ చేసే ర్యాక్‌ల సరఫరా కోసం రూ.12 కోట్ల అంచనాతో గత నెల 23న ప్రకటన జారీచేశారు. అందులోనూ రెండుసార్లు టెండర్ నిబంధనలు మార్చారు. సోమవారమే టెండర్ తెరవాల్సి ఉండగా.. ఈ నెల 26 వరకు వాయిదా వేశారు. అలాగే, గుడ్లు, కంది పప్పు సరఫరా కోసం టెండర్ల నిర్వహణలోనూ సరైన మార్గదర్శకాలు రూపొందించడంలో ఆ శాఖ అధికారులు విఫలమయ్యారు.