Kodada: కోదాడలో బయటపడినవి.. చాళుక్య భీమ నాటి రాగి పలకలు
ABN , Publish Date - Jul 06 , 2025 | 05:17 AM
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇటీవల బయటపడిన రాగి పలకలు వేంగి చాళుక్యుల నాటి భీమ-1 కాలానికి చెందినవిగా పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు.

కోదాడ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇటీవల బయటపడిన రాగి పలకలు వేంగి చాళుక్యుల నాటి భీమ-1 కాలానికి చెందినవిగా పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. కోదాడ పట్టణం ఖబ్రస్థాన్‌లో ఏప్రిల్ 29న గుంతలు తవ్వుతుండగా మట్టికుండలో తొమ్మిది సెట్ల రాగి పలకలు లభించాయి. వీటిని రెవెన్యూ సిబ్బంది హైదరాబాద్‌లోని పురవాస్తుశాఖకు పంపారు. ఇటీవల వీటిని రసాయనాలతో శుద్ధిచేసి వెంగి చాళుక్య భీమ-1 (క్రీ.పూ.888-918) కాలంనాటివిగా పురావస్తుశాఖ గుర్తించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
మూడు రాగి పలకలపై సంస్కృతంలో చాళుక్య భీమ-1కు సంబంధించిన వివరాలున్నాయని పేర్కొన్నారు. అలాగే వరాహ, స్వస్తి త్రిభువనాంకుశతో కూడిన చిహ్నం ఉందని, రాగి పలకలపై ఉన్న సమాచారం చాళుక్యుల చరిత్రను తెలియజేస్తోందన్నారు. ఈ పలకలు సుమారు 50 కిలోల బరువు ఉన్నాయని, ప్రస్తుతం ఇవి తెలంగాణ వారసత్వశాఖ ఆధీనంలో ఉన్నాయని అధికారులు తెలిపారు.