Share News

అమృత్‌ 2.0 అమలుకు అడుగులు

ABN , Publish Date - May 23 , 2025 | 04:35 AM

పట్టణాలను పరిశుభ్రత, ఆర్థిక స్వయం సమృద్ధి, అక్కడ నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం అమృత్‌ 2.0 సంస్కరణలను అమలు చేస్తోంది.

అమృత్‌ 2.0 అమలుకు అడుగులు

  • చెత్త సేకరణకు రూ.250 కోట్ల పనులకు టెండర్లు

  • చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తికి రూ.225 కోట్లు

  • పర్యావరణ సమతౌల్యం కోసమూ ప్రణాళికలు

హైదరాబాద్‌, మే 22(ఆంధ్రజ్యోతి): పట్టణాలను పరిశుభ్రత, ఆర్థిక స్వయం సమృద్ధి, అక్కడ నివసించే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం అమృత్‌ 2.0 సంస్కరణలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం నుంచి వచ్చే నిధులను సమర్థంగా వినియోగించుకునేందుకు, అమృత్‌ ప్రాజెక్టు కింద చేపట్టాల్సిన ప్రాజెక్టులను అమలు చేసేందుకు పురపాలక శాఖ టెండర్లు పిలిచింది. రాష్ట్రంలో 103 మునిసిపాలిటీల పరిధిలో రోజువారీ వచ్చే చెత్త సుమారు 4,316 టన్నులు ఉంటుందని అంచనా వేసిన అధికారులు.. ఆయా మునిసిపాలిటీల్లో చెత్త సేకరణ కోసం రూ.250 కోట్ల పనులకు టెండర్లు పిలిచారు. ఈ నిధులన్నీ స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరనున్నాయి. ఈ నెల 21తో టెండర్ల గడువు ముగియగా.. జూన్‌లో పనులు అప్పగించేలా పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. మరోవైపు సేకరించిన చెత్త నుంచి విద్యుత్తు ఉత్పత్తి చేసే ప్రాజెక్టులో భాగంగా ఈ పనులు చేసే ఏజెన్సీలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచారు. ప్రస్తుతం వేస్ట్‌ టు ఎనర్జీ ప్రాజెక్టు చేపట్టేందుకు రోజుకు 565 టన్నుల చెత్త అందుబాటులో ఉంది. ప్రాజెక్టు నిర్వహణకు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ద్వారా రూ.225 కోట్ల నిధులు అందుబాటులో ఉండటంతో టెండర్లు పిలిచారు. త్వరలోనే ఏజెన్సీలను ఎంపిక చేసి జూన్‌లో పనులు అప్పగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెల 26 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువు విధించారు.


పర్యావరణ సమతుల్యంపై అధ్యయనం..

రాష్ట్రంలోని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యం కోసం చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి కన్సల్టెన్సీని ఎంపిక చేసేందుకు కూడా పురపాలకశాఖ సంచాలకుల కార్యాలయం టెండర్లు ఆహ్వానించింది. ఎంపికైన ఏజెన్సీ వాతావరణ మార్పులపై అధ్యయనం చేయాల్సి ఉంటుం ది. అసాధారణ వాతావరణ పరిస్థితులకు కారణాలు.. నగరాలు, పట్టణాల్లో వాతావరణ సమతౌల్యానికి చేపట్టాల్సిన పనులపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. సిటీస్‌ 2.0 కింద దేశవ్యాప్తంగా పర్యావరణ సమతౌల్యం, కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టుకు అనుగుణంగా సంస్కరణలు అమలు చేయాల్సిఉంటుంది. ప్రాజెక్టుల వారీగా ప్రతిపాదనలు పంపితే అవసరమైన నిధులన్నీ కేంద్రం అందించనుంది. వాతావరణ సమతౌల్యానికి అనుకూలమైన ప్రణాళికలను తయారు చేసి అమలుచేసేలా కన్సల్టెన్సీ ప్రతిపాదనలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, భాగస్వాముల ఎంపిక, తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని పురపాలక శాఖ అధికారి ఒకరు ఆంధ్రజ్యోతికి వివరించారు.


మొత్తం 18 ప్రాజెక్టులు

అమృత్‌ 2.0 సంస్కరణల్లో భాగంగా సిటీస్‌ 2.0 కింద మొత్తం 18 ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంది. అందుకు అయ్యే వ్యయాన్ని కేంద్రం అందించనుంది. ప్రతి ప్రాజెక్టుకు గరిష్ఠంగా రూ.135 కోట్ల వరకు ఆర్థిక మద్దతు లభించనుంది. సిటీస్‌ 2.0 (సిటీ ఇన్వె్‌స్టమెంట్స్‌ టు ఇన్నోవేటివ్‌, ఇంటిగ్రేట్‌, అండ్‌ సస్టెయిన్‌) కార్యక్రమం ద్వారా పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధిలో భాగంగా అవసరమైన సహాయ సహకారాలను కేంద్రం అందించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:35 AM