Share News

Amgen: రాష్ట్రంలో ‘ఆమ్జెన్‌’ భారీ పెట్టుబడులు

ABN , Publish Date - Feb 25 , 2025 | 03:38 AM

అమెరికా కేంద్రంగా.. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో విస్తరించిన ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ ఆమ్జెన్‌.. తెలంగాణలో మరింత విస్తరించనుంది.

Amgen: రాష్ట్రంలో ‘ఆమ్జెన్‌’ భారీ పెట్టుబడులు

  • రూ.1600 కోట్లతో విస్తరిస్తామన్న కంపెనీ సీఈవో

  • టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

  • బయోటెక్‌ హబ్‌గా హైదరాబాద్‌ పేరు మరింత బలోపేతం

  • ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ దిశగా అడుగులు: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): అమెరికా కేంద్రంగా.. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో విస్తరించిన ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ ఔషధ తయారీ సంస్థ ఆమ్జెన్‌.. తెలంగాణలో మరింత విస్తరించనుంది. క్యాన్సర్‌, గుండె జబ్బులు, బోలు ఎముకల వ్యాధి, ఇన్‌ఫ్లమేటరీ, ఇతర అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమయ్యే ఔషధాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. భారత్‌లో ముంబై, హైదరాబాద్‌లో ఇప్పటికే ఈ కంపెనీకి కార్యాలయాలుండగా.. హైటెక్‌సిటీలో కొత్తగా అంతర్జాతీయ టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని నెలకొల్పింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఆమ్జెన్‌ చైర్మన్‌, సీఈవో రాబర్ట్‌.ఎ.బ్రాడ్‌వే సోమవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు, అమెరికా కాన్సుల్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సెన్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంపెనీ భారీ విస్తరణ ప్రణాళికలను బ్రాడ్‌వే ప్రకటించారు. ‘‘ఔషధాల శ్రేణిని మరింత సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్లో ఇన్నోవేషన్‌ సెంటర్‌ నెలకొల్పాం. ఏఐ, డేటా సైన్స్‌, డిజిటల్‌ సామర్థ్యాలతో ఇన్నోవేషన్‌ సైట్‌గా దీన్ని అభివృద్ధి చేస్తాం. ఈ ఏడాది చివరికల్లా రూ.1600 కోట్ల(200 మిలియన్‌ డాలర్లు) పెట్టుబడులు పెడతాం’’ అని వివరించారు. సమీప భవిష్యత్‌లో మరిన్ని విస్తరణ ప్రణాళికలున్నాయని, తెలంగాణలో పెట్టుబడులకు ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బయోఏషియా సదస్సుకు ముందు రోజే.. ఆమ్జెన్‌ భారీ పెట్టుబడులను ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఆమ్జెన్‌ విస్తరణతో హైదరాబాద్‌ నగరం బయోటెక్‌ హబ్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందన్నారు. గత ఏడాది ఆగస్టులో అమెరికా పర్యటన సందర్భంగా ఆమ్జెన్‌ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లోనే రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానించానని, ఇప్పుడు హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు. ‘‘లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా, బయో-టెక్‌ రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉంది. ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. అభివృద్ధి, దీర్ఘకాలిక విస్తరణ ప్రణాళికలతో వచ్చే పరిశ్రమలకు మా ప్రభుత్వం సహకరిస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. త్వరలో హైదరాబాద్‌ నగరం ప్రపంచ బయోటెక్‌ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఏఐసిటీలో పెట్టుబడులు పెట్టండి: శ్రీధర్‌బాబు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఏఐ సిటీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ఆస్ట్రేలియా-క్వీన్స్‌ లాండ్‌ ప్రభుత్వ ప్రతినిధులను కోరారు. క్వీన్స్‌ లాండ్‌ రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ మంత్రి రాసిన్‌ బేట్స్‌ ఆధ్వర్యంలోని బృందం సోమవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో శ్రీధర్‌ బాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ‘తెలంగాణ-క్వీన్స్‌లాండ్‌’ మధ్య ప్రాధాన్య రంగాల్లో సంబంధాలను మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు శ్రీధర్‌ బాబు తెలిపారు. త్వరలో రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే లైఫ్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయం గురించి ప్రత్యేకంగా వివరించామన్నారు. జీవ విజ్ఞానం, ఔషధ తయారీ రంగంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ప్రతినిధుల బృందం ఆసక్తి వ్యక్తంచేసిందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న క్రీడలు-నైపుణ్య విశ్వ విద్యాలయానికి సహకరిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్య, పరిశోధన, అభివృద్ధి, వ్యవసాయం తదితర అంశాల్లో క్వీన్స్‌లాండ్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. కార్యక్రమంలో క్వీన్స్‌ లాండ్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ సీఈవో జస్టిన్‌ మెక్‌ గవాన్‌, బెంగళూరులోని ఆస్ట్రేలియన్‌ కాన్సుల్‌ జనరల్‌ హిల్లరీ మెక్‌ గెచీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2025 | 03:38 AM