Share News

Telangana Govt Warning: గీత దాటొద్దు

ABN , Publish Date - May 21 , 2025 | 03:21 AM

ప్రభుత్వం అఖిల భారత సేవల అధికారులకు కఠిన హెచ్చరికలు జారీ చేసింది. విధులకు కట్టుబడి ఉండాలని, బహిరంగంగా అధిక ఉత్సాహం ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది.

Telangana Govt Warning: గీత దాటొద్దు

  • హుందాతనం మరవద్దు

  • విధులకు కట్టుబడి ఉండండి.. క్రమశిక్షణ పాటించండి

  • సర్వీసు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోండి

  • బహిరంగ సభల్లో మితిమీరి జోక్యం చేసుకోవద్దు

  • అత్యుత్సాహం ప్రదర్శించి ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చొద్దు

  • అఖిలభారత సర్వీసు అధికారులకు ప్రభుత్వం హెచ్చరిక

  • ఇటీవల చోటుచేసుకున్న ఉదంతాల నేపథ్యంలో ఉత్తర్వులు

హైదరాబాద్‌, మే 20 (ఆంధ్రజ్యోతి):

ఖిల భారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల్లో కొందరు.. పరిధి దాటి ప్రవరిస్తుండడం, హద్దులను మరిచి అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వారు తమ విధులకు కట్టుబడి ఉండాలని, సర్వీస్‌ నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలని సూచించింది. బహిరంగ సభల్లో మితిమీరిన జోక్యం చేసుకోవద్దని, హుందాగా వ్యవహరించాలని హెచ్చరించింది. సమూహాలు, బహిరంగ సభల్లో పాల్గొనడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని తెలిపింది. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని ఉదంతాల నేపథ్యంలో సర్కారు ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని అఖిలభారత అధికారులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు.. విధులకు కట్టుబడి, హద్దుల్లో ఉండాలని పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం రెండు వేర్వేరు అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కొంతమంది అధికారులు బహిరంగ సభలు, ప్రజా సమూహాల్లో అనుచితంగా ప్రవర్తించిన ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. నిజానికి రాష్ట్రంలో అధికారులు మితిమీరి ప్రవర్తిస్తున్న సంఘటనలు గత కొంతకాలంగా ఉంటున్నాయి. ఓ ఐఏఎస్‌ అధికారి.. సీఎం రేవంత్‌రెడ్డి కాళ్లకు మొక్కే ప్రయత్నం చేశారు. మరో ఐఏఎస్‌ అధికారి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఓ శాఖ విభాగాధిపతి (హెచ్‌వోడీ)గా పనిచేసిన అధికారి.. ఓ పార్టీకి అనుకూలంగా పని చేశారు. ఎన్నికల్లో పోటీకి టికెట్‌ సాధించే క్రమంలో ఆయన ఆ పార్టీకి వంత పాడారు. ఇలాంటి ఉదంతాలు ఐఏఎ్‌సలు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, వారి సేవలను ప్రశ్నార్థకం చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా చేయడమే కాకుండా... అధికారుల సేవల సామర్థ్యాన్ని కూడా తక్కువ చేస్తాయని పేర్కొంది.


విధులకు బద్ధులై ఉండాలి..

‘అఖిల భారత సర్వీసు ప్రవర్తనా నియమావళి-1968’లోని రూల్‌ 3(1) ప్రకారం అఖిల భారత అధికారి పూర్తి వినయ విధేయలతో ఉండాలని, విధులకు బద్ధుడై ఉండాలని, ఎలాంటి బహిరంగ సభల్లో పాల్గొనకూడదని ప్రభుత్వం తెలిపింది. వృత్తిపరమైన ఉన్నత విలువలను పాటించాలని, ప్రజలతో మాట్లాడే సందర్భాల్లో, వృత్తిలో భాగంగా పూర్తి మర్యాద పాటించాలని ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని పేర్కొంది. అధికారులు, ఉద్యోగుల మితిమీరిన ప్రవర్తన వల్ల తప్పుడు ప్రచారం జరుగుతుందని, ఇది ఉద్యోగులకు వ్యక్తిగతంగా నష్టం చేయడమే కాకుండా ప్రభుత్వ ప్రతిష్ఠను కూడా దిగజారుస్తుందని తెలిపింది. ‘తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌(కాండక్ట్‌) రూల్స్‌-1964’లోని రూల్‌ 3 ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు క్రమశిక్షణ, నిష్పాక్షికత, సమగ్రతను పాటించాలని గుర్తు చేసింది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ఏ ఒక్క ఉద్యోగీ ప్రవర్తించకూడదని, అసభ్య పదజాలాన్ని వాడరాదని హెచ్చరించింది. ఎలాంటి అపసవ్య పద్ధతులను అనుసరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు అన్ని శాఖల విభాగాధిపతులు ఈ విషయాన్ని తమ అధికారులు, ఉద్యోగులకు తెలియజేయాలని సూచించింది.


అప్పట్లో నాటి సీఎంకు... ఇప్పుడు నేటి సీఎంకు

ఓ ఐఏఎస్‌ అధికారి మితిమీరిన ప్రవర్తన ప్రతిసారీ చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా ఐఏఎస్‌ సర్కిల్‌ను ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెడుతోంది. ఆయన ఏమి ఆశించి ఇలాంటి చర్యలకు దిగుతున్నారోనంటూ మిగతా ఐఏఎ్‌సలు అసహనానికి గురవుతున్నారు. బీఆర్‌ఎస్‌ పరిపాలనలో ఆ అధికారి.. అప్పటి సీఎం కేసీఆర్‌ కాళ్లకు మొక్కబోయారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి కాళ్లకూ మొక్కే ప్రయత్నం చేశారు. దీంతో.. ఎవరు అధికారంలో ఉంటే ఆ సీఎం కాళ్లకు మొక్కడం ఒక తంతుగా ఆయన మార్చుకున్నారని ఐఏఎస్‌ అధికారుల్లో చర్చ జరుగుతోంది. అఖిలభారత సర్వీసు అధికారిగా హుందాగా ఉండాలని, రాజకీయ నాయకుల కాళ్లకు మొక్కడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక.. ప్రభుత్వం మారగానే సోషల్‌ మీడియా వేదికగా కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్న మరో ఐఏఎస్‌ అధికారి తీరునూ ఇతర అధికారులు తప్పుబడుతున్నారు. సర్వీసు పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు దిగకూడదని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇలాంటి అధికారుల వల్లే ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.

Updated Date - May 21 , 2025 | 03:23 AM