Alcohol Sales: మత్తు తగ్గింది
ABN , Publish Date - Mar 15 , 2025 | 04:20 AM
రాష్ట్రంలో మూడు నెలలుగా మద్యం విక్రయాలు ‘మత్తు’గా సాగుతున్నాయి. అమ్మకాలు, ఆదాయం రెండూ తగ్గిపోయాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో అమ్మకాలు గతేడాది ఇవే నెలలతో పోలిస్తే తగ్గాయి.
రాష్ట్రంలో తగ్గిన మద్యం, బీర్ల విక్రయాలు
ఇందుకు పలు కారణాలు..
పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ సరఫరా
ఏపీలో అందుబాటులోకి బ్రాండెడ్ మద్యం
కల్తీ కల్లు, నాటు సారాపై నియంత్రణ కరవు
ఎంఆర్‌పీ కన్నా అధిక ధరకు అమ్మకం
3 నెలల్లో తగ్గిన 1104 కోట్ల విక్రయాలు!
హైదరాబాద్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు నెలలుగా మద్యం విక్రయాలు ‘మత్తు’గా సాగుతున్నాయి. అమ్మకాలు, ఆదాయం రెండూ తగ్గిపోయాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో అమ్మకాలు గతేడాది ఇవే నెలలతో పోలిస్తే తగ్గాయి. అలాగే 2024 డిసెంబరు అమ్మకాలు కూడా 2023 డిసెంబరుతో పోలిస్తే క్షీణించాయి. దీంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఏటా మద్యం, బీర్ల అమ్మకాలు పెరుగుతుండగా.. ఈ సారి మాత్రం మూడు నెలల్లోనే రూ.1104 కోట్ల విలువైన అమ్మకాలు తగ్గాయి. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేరున్న సంస్థల మద్యం విక్రయించేవారు కాదు. అక్కడ బ్రాండెడ్ మద్యం దొరక్కపోవడంతో సరిహద్దు జిల్లాలైన నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ల నుంచి ఏపీ వాసులు మద్యాన్ని కొనుగోలు చేసేవవారు. దీంతో తెలంగాణలో మద్యం విక్రయాలు పెరిగాయి. ఏపీలో టీడీపీ సర్కారు వచ్చిన తర్వాత కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా అన్ని రకాల బ్రాండెడ్ మద్యం దొరుకుతోంది. ఆ ప్రభావం తెలంగాణ మద్యం విక్రయాలపై పడిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్ర సరిహద్దు జిల్లాలకు ‘సుంకం చెల్లించని మద్యం (ఎన్‌డీపీఎల్)’ జోరుగా వస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వాళ్లు మన మద్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కానీ, ఆ రాష్ట్రాల నుంచి ఎన్‌డీపీఎల్‌ను మాత్రం మన రాష్ట్రంలో అనధికారికంగా అమ్మేస్తున్నారు. రంగారెడ్డి డివిజన్‌లోని శంషాబాద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో నిర్దేశించిన లక్ష్యం పూర్తిచేయడానికి డ్రగ్స్, ఎన్‌డీపీఎల్ అవరోధంగా మారిందని డిప్యూటీ కమిషనర్ దశరథ్ ఇటీవల అధికారులతో సమీక్షలో చెప్పారు. రాష్ట్రంలో కల్తీ కల్లు, మద్యం, నాటుసారాను సరిగా నియంత్రించకపోవడం కూడా మద్యం విక్రయాలు తగ్గడానికి ఓ కారణమైంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కల్తీ కల్లు తయారవుతోంది. పలు మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తుండడంతో మద్యం ప్రియులు ప్రత్యామ్నాయంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. మద్యం అమ్మకాలు తగ్గడానికి ఇదీ ఓ కారణమని అధికారులు అంటున్నారు.
మూడు నెలలుగా కనిపించని జోష్..
మద్యం, బీర్ల విక్రయాలు పెరిగితే అదే రీతిలో ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ, గత మూడు నెలలుగా మద్యం విక్రయాలు తగ్గాయి. ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం.. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.9,438 కోట్ల మద్యం విక్రయాలు జరగ్గా, గత ఏడాది ఇదే సమయంలో రూ.10,542 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి. అంటే రూ.1104 కోట్ల అమ్మకాలు తగ్గాయి. భారీగా అమ్మకాలు తగ్గడంతో ఆ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఏడాది శాఖకు కేటాయించిన ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటామో లేదోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఇక ఇదేసమయంలో మద్యం, బీర్ల విక్రయాల లెక్కల్లో చాలా వ్యత్యాసం ఉంది. 2023 డిసెంబరులో 43.61 లక్షల కార్టన్ల మద్యం విక్రయించగా.. గత ఏడాది డిసెంబరులో 38.08 లక్షలే అమ్ముడుపోయాయి. 2024 జనవరిలో 32.61 లక్షల కార్టన్లు విక్రయించగా.. ఈ జనవరిలో 31.31 లక్షల కార్టన్లకు పడిపోయాయి. ఇక గత ఏడాది ఫిబ్రవరిలో 32.11 లక్షల కార్టన్లు అమ్మితే.. ఈ సారి 28.79 లక్షలకు పడిపోవడం అధికారులను కలవరపెడుతోంది. బీర్ల విషయానికి వస్తే 2023 డిసెంబరులో 46.23 లక్షల కేసులు అమ్మగా.. 2024 డిసెంబరులో 45.09 లక్షల కేసులే విక్రయించారు. గత ఏడాది జనవరిలో 39.29 లక్షల కేసులు అమ్మితే.. ఈ సారి 42.16 లక్షల కేసులకు చేరింది. గత ఫిబ్రవరిలో 43.08 లక్షల కేసులు విక్రయించగా ఈ సారి 41.67 లక్షల కేసులే అమ్ముడయ్యాయి. ఎక్సైజ్ శాఖ ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.35 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతోంది. ఈ మూడు నెలల్లో తగ్గిన అమ్మకాల ప్రభావం ఆ శాఖకు నిర్దేశించిన లక్ష్యంపై పడనుంది.