Road Safety: రహదారులపైనా ఏఐ!
ABN , Publish Date - Aug 18 , 2025 | 04:44 AM
ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం తీసుకునే దిశగా ప్రపంచ దేశాలన్నీ అడుగులు వేస్తున్నాయి.
హడలెత్తిస్తోన్న రోడ్డు ప్రమాదాలకు చెక్.. ప్రమాదాలను తగ్గించేందుకు స్మార్ట్ విధానాలపై దృష్టి
భారత్, తెలంగాణలోనూ ఆ దిశగా అడుగులు
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులకు సమాచారం
హైదరాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఏటా లక్షలాది మందిని బలి తీసుకుంటున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం తీసుకునే దిశగా ప్రపంచ దేశాలన్నీ అడుగులు వేస్తున్నాయి. ఆయా దేశాలన్నీ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఈ మేరకు వాహనదారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా ఏఐ ఆధారిత ‘అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ విధానంలో మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ వినియోగించుకునే ఏఐ ఆధారిత కెమెరాలను రహదారులపై ఏర్పాటు చేస్తారు. ఈ అత్యాధునిక వ్యవస్థ ద్వారా తొలుత హైవేలపై నిబంధనల ఉల్లంఘనకు చెక్ పెడతారు. వాహనదారులు సీటు బెల్టు పెట్టుకోకపోయినా, పరిమితికి మించి వేగంతో నడిపినా ఈ స్మార్ట్ కెమెరాలు సులువుగా పసిగడతాయి. వెంటనే ప్రయాణికులకు సిగ్నల్స్ రూపంలో హెచ్చరికలు జారీచేస్తాయి. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక సిబ్బందికి, జాతీయ రహదారుల అధికారులకు సమాచారం అందిస్తాయి. అవసరమైన ఎమర్జెన్సీ సేవలను అక్కడికి పంపేలా పనిచేస్తాయి. నిబంధనలు అతిక్రమించిన వాహన వివరాలను సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు మానవ ప్రమేయం లేకుండానే చలాన్లు జారీ చేస్తాయి. ఇలా హైవేలపై టెక్నాలజీ వినియోగం ద్వారా కనీసం 2030నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఏడాదిలో నమోదవుతున్న రోడ్డు ప్రమాదాలు, తద్వారా సంభవిస్తున్న మరణాలను తగ్గించాలనే లక్ష్యంతో ఆయా దేశాలు ముందుకు సాగుతున్నాయి.
అమెరికా, చైనాల్లో ఇప్పటికే స్మార్ట్ విధానం
అమెరికా, చైనా దేశాలు ఇప్పటికే తమ దేఽశాల్లో చాలా చోట్ల స్మార్ట్ విధానాల్ని అమల్లోకి తెచ్చాయి. ముఖ్యంగా చైనా అయితే వాహనాల తయారీ సంస్థలతోనే చర్చలు జరుపుతోంది. అత్యంత భద్రతతో కూడిన వాహనాలను ప్రజలకు అందించాలని, ప్రమాదాలు జరిగినా ప్రయాణికులు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా సంస్థలకు సూచిస్తోంది. అలాగే ఆస్ట్రేలియా కూడా స్మార్ట్ రోడ్ టెక్నాలజీని అమలుచేస్తోంది. రాత్రిపూట జరిగే ప్రమాదాలను తగ్గించే విధంగా రోడ్లకు అంచున ఫొటో లూమినిసెంట్ మార్కింగ్‌లను చేస్తోంది. ఇది పగటిపూట సూర్య కిరణాలను గ్రహించుకుని, రాత్రిపూట ఒక రకమైన రంగులో మెరుస్తుంది. అది వాహనదారులకు రోడ్డు ఎటువైపుగా ఉందో.. ఎటు వెళ్లాలన్నది స్పష్టంగా తెలియజేస్తుంది.
ప్రయోగాత్మకంగా ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై
భారత్‌లోనూ ఢిల్లీ-గురుగ్రామ్ హైవేపై ఈ స్మార్ట్ వ్యవస్థను తాజాగా ప్రారంభించారు. దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డిజిటల్ హైవేగా ఈ ర హదారి గుర్తింపు పొందింది. కిలో మీటరుకు ఒకటి చొప్పున మొత్తం 110 హై రిజల్యూషన్ కెమెరాలను అమర్చింది. ఇవి 24 గంటలు రహదారులపై జరిగే ప్రతి కదలికను రికార్డు చేస్తాయి. ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రమాదాల్ని గుర్తించడం సహా దాదాపు 14 రకాల ట్రాఫిక్ ఉల్లంఘనలను ఈ కెమెరాలు గుర్తించగలవు. త్వరలో హైదరాబాద్-నాగపూర్ (ఎన్‌హెచ్-44) మార్గంలోనూ స్మార్ట్ హైవే విధానం అందుబాటులోకి రానుంది. కాగా, రోడ్డు ప్రమాదాలతో దేశ వార్షిక జీడీపీకి మూడు శాతం కలుగుతోందని స్వయంగా కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2024లో దేశ వ్యాప్తంగా 4.80లక్షల నుంచి 5లక్షల వరకు రోడ్డు ప్రమాదాలు జరగగా.. దాదాపు 1.72లక్షల మందికి మృతి చెందారని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి. దీని ప్రకారం దేశంలో ప్రతీ గంటకు 20-22 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణలో నూ ఈ ఏడాది 25,934 ప్రమాదాలు జరగ్గా 7,281 మంది మరణించారని పోలీసు, రవాణా శాఖ నివేదికలు చెబుతున్నాయి. రోజుకు సగటున 70 ప్రమాదాలు, 20 చొప్పున మరణాలు చోటుచేసుకున్నాయని గణాంకాలతో స్పష్టమవుతోంది.
నిర్మాణం, నిర్వహణ లోపాలు
కార్లు, ద్విచక్ర వాహనాలు, బస్సులు, భారీ వాహనాలు, ఆటోలు, సైకిళ్లు, పాదచారులు ఇలా అందరూ రోడ్డును అస్తవ్యస్తంగా ఉపయోగించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. లోపభూయిష్టమైన రోడ్ల డిజైన్, నాసిరకమైన నిర్మాణాలు, అసమర్థ నిర్వహణతో పాటు మారని మనుషుల తీరు, సంస్థాగత నిర్లక్ష్యం సంక్షోభానికి కారణమవుతున్నాయి. ట్రాఫిక్ నియమాలు కఠినంగా అమలుకాకపోవడం, మితిమీరిన వేగం మద్యం సేవించి వాహనాలు నడపడం, చట్టాలు కఠినంగా లేకపోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు కచ్చితమైన అవగాహన లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏయూ మాజీ రిజిస్ట్రార్ల అరెస్ట్‌కు వారెంట్ జారీ
బిహార్ ఎన్నికలు.. కొత్త కుట్ర: ఎంపీ రాహుల్ గాంధీ