Share News

Adilabad: జాయింట్‌ ఎయిర్‌ ఫీల్డ్‌తో ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:33 AM

ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీని ఏర్పాటుకు గత ఏప్రిల్‌లో భారత వాయుసేన (ఐఏఎఫ్‌) పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే.

Adilabad: జాయింట్‌ ఎయిర్‌ ఫీల్డ్‌తో ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు

వాయుసేన, ప్రయాణికుల విమానాలకు వేర్వేరు టర్మినళ్లు

  • సిద్ధమవుతున్న మాస్టర్‌ ప్లాన్‌

  • సీఎం రేవంత్‌, మంత్రి కోమటిరెడ్డి చొరవ

  • విమానాశ్రయ ఏర్పాటుకు 950 ఎకరాల భూమి అవసరం

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు కోసం వడివడిగా అడుగులు పడుతున్నాయి. దీని ఏర్పాటుకు గత ఏప్రిల్‌లో భారత వాయుసేన (ఐఏఎఫ్‌) పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. ప్రయాణికులు/ఐఏఎఫ్‌ విమానాలు తిరిగేందుకు వీలుగా విమానాశ్రయం నిర్మాణానికి 950 ఎకరాల భూమి అవసరమని ఇటీవల కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో నిర్ధారించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఇండియన్‌ ఎయిర్‌ పోర్టు అథారిటీ, భారత వాయుసేన, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పౌర విమానయాన విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే ఏరోడ్రోమ్‌ పరిధిలో సుమారు 350 ఎకరాలుండగా, మరో 600 ఎకరాల భూమిని సేకరించాలని సివిల్‌ ఏవియేషన్‌, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. అదనంగా అవసరమైన 600 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉంటుంది. ప్రయాణికుల విమానాలు, ఐఏఎఫ్‌ విమానాలు తిరిగేందుకు రన్‌వే (ఎయిర్‌స్ట్రి్‌ప)కు ఇరువైపులా టర్మినళ్ల నిర్మాణంతోపాటు మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయానికొచ్చినట్లు సమాచారం.


ట్యాక్సీ/లింక్డ్‌ బేస్‌ విధానంలో రన్‌వే నిర్మిస్తారని చెబుతున్నారు. వాయుసేన, ప్రయాణికుల విమానాల ప్రయాణానికి వీలుగా జాయింట్‌ యూజర్‌ ఎయిర్‌ఫీల్డ్‌ పటిష్ఠంగా నిర్మించాలని ప్రతిపాదించారు. త్వరితగతిన విమానాశ్రయ పనుల పూర్తికి ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ, ఎయిర్‌ఫోర్స్‌ నుంచి ఇద్దరేసి అధికారులతో జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ఎయిర్‌ఫోర్స్‌, ప్రయాణికుల విమానాల నిర్వహణకు 2 ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్స్‌ (ఏటీసీ) ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనివల్ల 2 రకాల విమానాల ప్రయాణాలకు సాంకేతిక సమస్య తలెత్తదని అభిప్రాయాలు వెల్లడయ్యాయని సమాచారం. ప్రతిపాదిత రన్‌వే, టర్మినళ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు అవసరమైన మాస్టర్‌ ప్లాన్‌ను త్వరలోనే కేంద్రానికి నివేదిస్తారని అధికార వర్గాల కథనం. ఎయిర్‌ బస్‌-320 విమానాలు తిరిగేలా విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. వాయుసేన విమానాల పార్కింగ్‌కు వసతులు కల్పిస్తారు. పగలూ రాత్రి (డే అండ్‌ నైట్‌) విమానాలు తిరిగేలా ఏర్పాట్లు చేయనున్నారని వినికిడి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి కొత్త విమానాశ్రయాల ఏర్పాటు విషయమై ప్రత్యేక దృష్టి సారించింది. వీటి ఏర్పాటు కోసం సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఇందుకు రాష్ట్ర పౌర విమానయాన విభాగంతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు

Updated Date - Aug 07 , 2025 | 04:33 AM