Hyderabad: అక్రమ ‘ప్రకటన’లు!
ABN , Publish Date - Feb 14 , 2025 | 04:16 AM
వాణిజ్య ప్రకటనల ఏజెన్సీలు అక్రమ సంపాదన కోసం రూటు మార్చాయి. ఇన్నాళ్లూ హైదరాబాద్ నగరంలో అక్రమ హోర్డింగులతో రూ.కోట్లు ఆర్జించిన సంస్థలు.. ఇప్పుడు శివార్ల బాట పట్టాయి.

హైదరాబాద్ శివార్లలో అనుమతి లేకుండా
హోర్డింగులు, యూనిపోల్స్
అక్రమార్జనలో రూటు మార్చిన యాడ్ ఏజెన్సీలు
హైడ్రా స్పెషల్ డ్రైవ్.. 53 నేలమట్టం
ప్రకృతి రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్ కూడా..
హైకోర్టు తీర్పుతో కూల్చివేసిన హైడ్రా
హైదరాబాద్ సిటీ/శామీర్‌పేట, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): వాణిజ్య ప్రకటనల ఏజెన్సీలు అక్రమ సంపాదన కోసం రూటు మార్చాయి. ఇన్నాళ్లూ హైదరాబాద్ నగరంలో అక్రమ హోర్డింగులతో రూ.కోట్లు ఆర్జించిన సంస్థలు.. ఇప్పుడు శివార్ల బాట పట్టాయి. ఏ విభాగం అనుమతి లేకుండా ప్రధాన రహదారుల వెంట హోర్డింగ్‌లు ఏర్పాటు చేసి.. రూ.లక్షల్లో అద్దె వసూలు చేస్తున్నాయి. స్థానిక మునిసిపాలిటీలు, కార్పొరేషన్లతో కలిసి హైడ్రా నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో అక్రమ హోర్డింగుల బాగోతం బయటపడింది. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అనుమతి లేని హోర్డింగులు, యూనిపోల్స్‌ను సిబ్బంది తొలగిస్తున్నారు. గురువా రం శంషాబాద్, కొత్వాల్‌గూడ, నార్సింగి, తొండుపల్లి, గొల్లపల్లి రోడ్డు, తెల్లాపూర్ ప్రాంతాల్లో మెయిన్ రోడ్లకు ఇరువైపులా అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లను కూల్చివేశారు. ఇప్పటి వరకు 53 హోర్డింగ్‌లు, యూనిపోల్స్ తొలగించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అనుమతులున్న వాటి జోలికి వెళ్లబోమని, అనుమతులు లేని వాటిని ఉపేక్షించబోమని తనను కలిసిన యాడ్ ఏజెన్సీల ప్రతినిధులకు కమిషనర్ స్పష్టం చేశారు. తొలగించిన వాటిలో ప్రకాశ్, యుని యాడ్స్, ఐ క్యాచ్ తదితర సంస్థల హోర్డింగ్‌లు, యూనిపోల్స్ ఉన్నట్లు హైడ్రా వర్గాలు చెబుతున్నాయి.
ఇక్కడ నిషేధం ఉండడంతో..
శివారు ప్రాంతాల్లో కొన్ని యాడ్ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. అనుమతి తీసుకున్న దాని కంటే రెండు, మూడు రెట్లు అధికంగా ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేస్తున్నాయి. గంటలు, రోజుల వారీగా రుసుము వసూలు చేస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్నాయి. నిర్ణీత రుసుము చెల్లించి స్థానిక సంస్థల నుంచి ప్రకటనల బోర్డుల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాల్సి ఉండగా.. మెజారిటీ ఏజెన్సీలు నిబంధనలను పాటించకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నాయి. అయినా అధికారులు స్పందించడం లేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో హోర్డింగ్‌లు, యూనిపోల్స్‌పై నిషేధం ఉన్న నేపథ్యంలో యాడ్ ఏజెన్సీలు శివారు ప్రాంతాలపై దృష్టి సారించాయి. అంతర్జాతీయ విమానాశ్రయం- బెంగళూ రు, నాగ్‌పూర్-పుణె, నాగార్జునసాగర్, వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారుల వెంట భారీగా యూని పోల్స్, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశాయి. వీటిలో అను మతి లేనివే ఎక్కువగా ఉన్నట్లు హైడ్రా గుర్తించింది.
గడువిచ్చినా స్పందించని నిర్వాహకులు.. కూల్చేసిన హైడ్రా
హైడ్రా బుల్డోజర్లు మరోసారి రంగంలోకి దిగాయి. హైకోర్టు ఆదేశాలతో చెరువులో ఆక్రమణలను గురువారం నేలమట్టం చేశాయి. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా తూముకుంట మునిసిపాలిటీ పరిధిలోని కోమటికుంటలో ఉన్న రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేశారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ, ఇరిగేషన్, మునిసిపాలిటీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సర్వే చేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ప్రకృతి రిసార్ట్, ప్రకృతి కన్వెన్షన్ సెంటర్ ఉన్నట్లు నిర్ధారించారు. వాటికి ఎలాంటి అనుమతులూ లేవని తేల్చారు. ఎఫ్‌టీఎల్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చకూడదో వివరణ ఇవ్వాలంటూ హైడ్రా నోటిసులు జారీ చేసింది. దీంతో రిసార్ట్స్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ విభాగాలు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని నిర్ధారించుకున్న న్యాయస్థానం నిబంధనల ప్రకారం నడుచుకోవాలని ఆదేశించింది. తామే నిర్మాణాలు కూల్చివేస్తామని, అందుకు నెల రోజులు సమయం కావాలని ప్రకృతి రిసార్ట్, కన్వెన్షన్ ప్రతినిధులు హైడ్రాను కోరగా.. సమ్మతించింది. అయితే నెల రోజులు పూర్తయినా నిర్మాణాలు కూల్చివేయలేదు. దీంతో హైడ్రా యంత్రాలు.. ఆ నిర్మాణాలను నేలమట్టం చేశాయి.