Share News

Formula E: ఏసీబీ ఎదుటకు ఎఫ్‌ఈవో ప్రతినిధులు

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:42 AM

ఫార్ములా ఈ-కారు రేసులో అక్రమాలకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Formula E: ఏసీబీ ఎదుటకు ఎఫ్‌ఈవో ప్రతినిధులు

  • ఫార్ములా ఈ-కారు రేసు కేసులో వర్చువల్‌ విచారణ

  • సంస్థ ప్రతినిధులను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు

  • రేసు నిర్వహణకు కుదుర్చుకున్న ఒప్పందాలు,

  • నగదు చెల్లింపులపై ఆరా తీసిన అధికారులు

  • విచారణ మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్‌

  • ప్రత్యక్ష విచారణకు రప్పించే యోచనలో ఏసీబీ!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ-కారు రేసులో అక్రమాలకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అత్యంత ముఖ్యమైన ఫార్ములా-ఈ ఆపరేషన్స్‌ లిమిటెడ్‌ (ఎఫ్‌ఈవో) సంస్థ ప్రతినిధులను ఏసీబీ ప్రత్యేక బృందం సోమవారం విచారించింది. అయితే నేరుగా కాకుండా వర్చువల్‌ (ఆన్‌లైన్‌) పద్ధతిలో విచారణకు వారు హాజరయ్యారు. ఈ కేసు విచారణకు సంబంధించి తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఎఫ్‌ఈవో సంస్థ ప్రతినిఽధులకు ఏసీబీ అధికారులు జనవరిలోనే ఈ-మెయిల్‌లో నోటీసులు పంపించారు. అయితే తమ సంస్థ లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్నందున విచారణకు హాజరయ్యేందుకు కొంత గడువు కావాలని సంస్థ ప్రతినిధులు కోరడంతో.. దర్యాప్తు సంస్థ అందుకు అంగీకరించింది. కానీ, గడువు తీసుకున్నప్పటికీ సంస్థ ప్రతినిధులు నేరుగా అధికారుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. దీంతో చట్టపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ.. వర్చువల్‌ పద్ధతిలో వారిని విచారించింది. ఎఫ్‌ఈవో సీఈవో జెఫ్‌తోపాటు మరికొందరిని ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు లభించిన ఆధారాలు, నిందితులను విచారించిన సమయంలో వెల్లడించిన సమాచారం ఆధారంగా వారిని ఏసీబీ ప్రత్యేక బృందం ప్రశ్నించింది. ఫార్ములా ఈ-కారు రేసు నిర్వహణ కోసం సంస్థను ముందుగా ఎవరు సంప్రదించారు? తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరైనా అధికారులు, సంస్థ సంప్రదింపులు జరిపారా? కుదుర్చుకున్న ఒప్పందమేంటి? ఒప్పంద పత్రాల్లో పొందుపరుచుకున్న ప్రధానమైన అంశాలేవి? ముఖ్యంగా ఎంఏయూడీ నుంచి రూ.45.71 కోట్ల నిధులు ఎన్ని విడతల్లో బదిలీ అయ్యాయి? మధ్యలో వేరే సంస్థ ఒప్పందం ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? సంస్థకు భారతదేశంలో ఉన్న బ్రాంచ్‌లు ఎన్ని?.. వంటి ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించి కొన్ని పత్రాలను పీడీఎఫ్‌ రూపంలో వారితో షేర్‌ చేసుకుని వాటికి సంబంధించి కూడా ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.


ఆన్‌లైన్‌లో పత్రాల అందజేత..

విచారణ సందర్భంగా ఫార్ములా ఈ-కారు రేసుకు సంబంధించి 2022 అక్టోబరు 25న ఎంఏయూడీ, ఎఫ్‌ఈవో, ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ మధ్య జరిగిన ఒప్పంద పత్రాలను కొన్నింటిని ఎఫ్‌ఈవో ప్రతినిధులు ఆన్‌లైన్‌లోనే ఏసీబీకి అందజేశారు. దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు సంబంధించి వారి వద్ద ఉన్న సమాచారాన్ని వెల్లడించారు. ఏస్‌ నెక్ట్స్‌జెన్‌ ప్రతినిధులు కారు రేసింగ్‌కు సంబంధించి తమను సంప్రదించినట్లు తెలిపారు. సుమారు గంటన్నరపాటు కొనసాగిన విచారణ క్రమాన్ని ఆడియో, వీడియో రూపంలో అధికారులు రికార్డు చేశారు. కాగా, ప్రస్తుతానికి వర్చువల్‌ పద్ధతిలో విచారించిన దర్యాప్తు అధికారులు.. అత్యంత కీలకమైన కేసు కావడంతో వారిని నేరుగా విచారించడం ద్వారా మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ఎఫ్‌ఈవో సంస్థకు మరోసారి నోటీసులు జారీ చేసి నేరుగా విచారణకు హాజరు కావాలని కోరే అవకాశం ఉంది. అయితే న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఎఫ్‌ఈవోకు రెండోసారి నోటీసుల విషయంలో ఏసీబీ ముందుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ప్రధాన నిందితులుగా పేర్కొన్న మాజీ మంత్రి కేటీఆర్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్‌ రెడ్డి, ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌ ఎండీని ఏసీబీ ఇదివరకే విచారించిన విషయం తెలిసిందే.

Updated Date - Feb 18 , 2025 | 04:42 AM