KTR: కేటీఆర్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లో ఏముంది?
ABN , Publish Date - Jun 18 , 2025 | 03:54 AM
ఫార్ములా-ఈ కార్ల రేసు వ్యవహారంలో, ముఖ్యంగా రేసు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఈఓ (ఫార్ములా-ఈ ఆపరేషన్స్)కు నిధుల జారీకి సంబంధించి కేటీఆర్ తన వాట్సాప్ ద్వారా అరవింద్‌కుమార్‌కు ఆదేశాలు ఇచ్చారనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది.
ఫార్ములా-ఈ వ్యవహారంలో వాట్సాప్‌లో ఆదేశాలిచ్చారా?
పరిశీలించేందుకు సిద్ధమైన ఏసీబీ
ఆయన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్ తమకు అప్పగించాలని ఆదేశం
విదేశాలకు వెళ్లిన అరవింద్ కుమార్‌కు వెంటనే వెనక్కి రావాలని ప్రభుత్వ ఆదేశం!
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా-ఈ కార్ల రేసు వ్యవహారంలో, ముఖ్యంగా రేసు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఈఓ (ఫార్ములా-ఈ ఆపరేషన్స్)కు నిధుల జారీకి సంబంధించి కేటీఆర్ తన వాట్సాప్ ద్వారా అరవింద్‌కుమార్‌కు ఆదేశాలు ఇచ్చారనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. హెచ్‌ఎండీఎ ఖాతాల నుంచి ఎఫ్‌ఈఓకు నిధులు బదిలీ చేసే ముందు తనకు, కేటీఆర్‌కు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల విషయమై ఏసీబీ విచారణ సందర్భంగా అరవింద్ కుమార్ వివరించినట్టు సమాచారం. దీనితో ఆ సమయంలో ఉపయోగించిన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టా్‌పను తమకు అప్పగించాలని కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు ఈ కేసులో ఏ2 నిందితుడైన ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ వ్యక్తిగత సెలవుపై విదేశాలకు వెళ్లడంపై సీఎంకు ఏసీబీ అధికారులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అరవింద్ కుమార్ సెలవు రద్దు చేసుకుని, వెంటనే వెనక్కి రావాలని సీఎస్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లినట్టు తెలిసింది.
లాయర్ల బృందంతో కేటీఆర్ భేటీ..
తన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్ ఇవ్వాలని ఏసీబీ కోరిన నేపథ్యంలో కేటీఆర్ మంగళవారం హైదరాబాద్‌లో తమ న్యాయవాదుల బృందంతో భేటీ అయి చర్చించారు. ఈ క్రమంలో ప్రభుత్వ లావాదేవీలకు సంబంధించి ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండా మొబైల్ ఫోన్లు అడిగే హక్కు ఏసీబీకి లేదని న్యాయవాదుల బృందం అభిప్రాయపడినట్టు సమాచారం. గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పుల ప్రకారం కేటీఆర్ తన మొబైల్, లాప్‌టా్‌పను ఏసీబీకి ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నట్టు తెలిసింది. విచారణ సంస్థలు ఒక పౌరుడి నుంచి ేసకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరుడిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని పేర్కొన్నట్టు సమాచారం.
మహేశ్‌గౌడ్‌కు కేటీఆర్ లీగల్ నోటీస్
ట్యాపింగ్ పేరిట తమ పార్టీనేతలపై పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తమపై ఎటువంటి సాక్ష్యాధారాల్లేకుండా, అసత్య ఆరోపణలు చేసిన మహేశ్‌గౌడ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మహేశ్‌గౌడ్‌కు లీగల్ నోటీసులు పంపినట్టు తెలిపారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్‌ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని, కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. రాజకీయ పబ్బం కోసం దుర్మార్గ పూరిత వ్యాఖ్యలు చేస్తే మహేశ్ గౌడ్ వంటి నాయకులను కోర్టులకు ఈడుస్తామని పేర్కొన్నారు.