Entrance Exams: గురుకుల ప్రవేశ పరీక్షలకు 96.40% హాజరు
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:36 AM
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలతోపాటు 6, 7, 8, 9వ తరగతుల్లోని బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాలకు ఎస్సీ గురుకులం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పరీక్షలకు 96.40 శాతం మంది హాజరయ్యారు.

హైదరాబాద్, ఖమ్మం సంక్షేమ విభాగం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలతోపాటు 6, 7, 8, 9వ తరగతుల్లోని బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాలకు ఎస్సీ గురుకులం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన పరీక్షలకు 96.40 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 446 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఆయా ప్రవేశాల కోసం మొత్తం 1,67,662 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 1,61,618 మంది (96.40 శాతం) హాజరయ్యారని, 6,044 మంది గైర్హాజరైనట్లు ఎస్సీ గురుకులం ఓ ప్రకటనలో తెలిపింది.
కాగా భద్రాద్రి జోనల్ పరిధిలోని 5 జిల్లాల్లో గురుకుల ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన ఐదుగురు విద్యార్థులకు నిరాశ ఎదురైంది. అధిక ఆదాయ పరిధిలో ఉన్నారని వీరిని పరీక్ష రాయనివ్వలేదు. హాల్ టికెట్ మంజూరు చేసి విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వచ్చాక అడ్డుకోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.