5.40 లక్షల టన్నుల ధాన్యం మాయం
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:28 AM
2022-23 రబీ సీజన్‌కు సంబంధించి 314 రైస్ మిల్లుల నుంచి 5.40 లక్షల టన్నుల ధాన్యం మాయమైనట్టు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. ఈ ధాన్యం రికవరీకి చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఆ మిల్లులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది.

రికవరీకి 314 రైస్ మిల్లులకు నోటీసులు!
2022-23 రబీ సీజన్‌కు సంబంధించి 314 రైస్ మిల్లుల నుంచి 5.40 లక్షల టన్నుల ధాన్యం మాయమైనట్టు పౌర సరఫరాల శాఖ గుర్తించింది. ఈ ధాన్యం రికవరీకి చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఆ మిల్లులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ జిల్లాల అదనపు కలెక్టర్లకు సర్క్యులర్ పంపారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించిన తనిఖీల్లో 30 జిల్లాల్లోని 314 మిల్లుల్లో ధాన్యం నిల్వలు తక్కువ ఉన్నట్లు గుర్తించారని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. మిల్లులకు నోటీసుల జారీ, న్యాయపరమైన చర్యలతో పాటు 25 శాతం జరిమానాతో ధాన్యాన్ని రికవరీ చేయాలని సూచించారు.
మిల్లుల వారీగా మాయమైన ధాన్యం వివరాలను పొందుపర్చిన జాబితాను కూడా పంపారు. 2022-23 రబీ సీజన్‌కు సంబంధించి 38 లక్షల టన్నుల ధాన్యాన్ని గత ఏడాది జనవరిలో పౌర సరఫరాల సంస్థ వేలం ద్వారా విక్రయించింది. వేలంలో పాల్గొని ధాన్యాన్ని దక్కించుకున్న బిడ్డర్లు.. మిల్లర్ల నుంచి సుమారు 25 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకున్నారు. మిగిలిన ధాన్యం నిల్వలు ఆయా మిల్లుల్లో లేవంటూ పౌరసరఫరాల సంస్థకు ఫిర్యాదు చేశారు. దీంతో నిర్వహించిన తనిఖీల్లో 314 రైస్ మిల్లుల్లో 5.40 లక్షల టన్నుల ధాన్యం లేదని గుర్తించారు.