Lift Tragedy: 25 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిన బాలుడు
ABN , Publish Date - Feb 23 , 2025 | 04:29 AM
అపార్ట్‌మెంట్‌లో లిఫ్టుకి, గోడకు మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలుడు అర్ణవ్ 25 గంటల పాటు మృత్యువుతో పోరాడి శనివారం తుదిశ్వాస విడిచాడు.

మంగళ్‌హాట్/అఫ్జల్‌గంజ్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): అపార్ట్‌మెంట్‌లో లిఫ్టుకి, గోడకు మధ్య ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన ఆరేళ్ల బాలుడు అర్ణవ్ 25 గంటల పాటు మృత్యువుతో పోరాడి శనివారం తుదిశ్వాస విడిచాడు. నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ చిన్నారి తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అర్ణవ్ తన తాత విజయ్‌కుమార్‌తో కలిసి మేనత్త నివాసం ఉంటున్న హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ శాంతినగర్ మఫర్ కంఫాటెక్ అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. లిఫ్ట్ తలుపులు తెరుచుకోగానే లోపలికి వెళ్లి మూడో అంతస్తు బటన్ నొక్కాడు. తాత ఎక్కేలోపే తలుపులు మూసుకోకుండానే లిఫ్ట్ పైకి కదిలిపోయింది. దాంతో అర్ణవ్ కంగారు పడి లిఫ్ట్ మొదటి అంతస్తుకు చేరుకోకముందే దూకేయడంతో లిఫ్ట్‌కు, గోడకు మధ్యలో ఇరుక్కుపోయాడు. పోలీసులు, డీఆర్‌ఎఫ్ బృందం దాదాపు మూడున్నర గంటలు శ్రమించి అర్ణవ్‌ను వెలికితీసి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. లిఫ్ట్‌లో ఇరుకున్న సమయంలో మెదడుకు ఆక్సిజన్ అందక కిడ్నీలు, ఇతర అవయవాలు దెబ్బతినడంతో అర్ణవ్ పరిస్థితి విషమించిందని, ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. కాగా, తమ మాట కాదని మతాంతర వివాహం చేసుకున్న కూతురి ఆచూకీ తెలుసుకున్న విజయ్‌కుమార్ మఫర్ కంఫాటెక్ అపార్ట్‌మెంట్‌కు వచ్చాడు. మేనత్తను చూపిస్తానంటూ మనుమడు అర్ణవ్‌ను కూడా తీసుకొచ్చాడు. కళ్లెదుటే మనుమడు ప్రమాదంలో చిక్కుకోవడంతో ఆయన విలవిలలాడిపోయాడు. ఒక్కగానొక్క కుమారుడు తమకు కాకుండాపోయాడని అర్ణవ్ తల్లిదండ్రులు అజయ్‌కుమార్ మసల్కర్, సుచిత మసల్కర్ కన్నీరుమున్నీరయ్యారు. వీరు నగరంలోని గోడేకి కబర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
కొన్ని నెలలుగా ఇలాగే లిఫ్ట్!
మఫర్ కంఫాటెక్ అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో అధునాతనమైనదే అయినప్పటికీ సాంకేతిక సమస్యతో కొన్ని నెలలుగా బటన్ నొక్కిన వెంటనే తలుపులు మూసుకోకుండానే పైకి వెళుతోందని అపార్ట్‌మెంట్ వాసులు తెలిపారు. లిఫ్ట్ నిర్వహణ బాధ్యత చూడాల్సిన వారు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఈ దుర్ఘటనకు ముఖ్య కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.