Mahesh Goud: కరీంనగర్‌లో ఒకే ఇంట్లో 40 ఓట్లు
ABN , Publish Date - Aug 26 , 2025 | 03:09 AM
కరీంనగ ర్‌లోని ఓ సేటు ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయని, ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్ర వాసులకు ఓట్లు...
నిజామాబాద్‌లో ఓటర్లుగా మహారాష్ట్ర వాసులు
ఎంత మందికి 2 ఓట్లు ఉన్నాయో లెక్కే లేదు
8 మంది బీజేపీ ఎంపీల గెలుపుపై సందేహాలు
రాహుల్ పాదయాత్రకు బిహార్‌లో బ్రహ్మరథం
బీసీలపై కిషన్‌రెడ్డికి ఎందుకంత కక్ష?
కేటీఆర్, కవిత ఆస్తుల గొడవ పదేళ్లైనా తెగదు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రె్‌సకు వంద సీట్లు పక్కా
జనహిత పాదయాత్రలో మహేశ్‌గౌడ్
వరంగల్/కరీంనగర్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరీంనగ ర్‌లోని ఓ సేటు ఇంట్లో 40 ఓట్లు ఉన్నాయని, ఈ అంశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్ర వాసులకు ఓట్లు ఉన్నాయని, ఎంత మందికి రెండు ఓట్లు ఉన్నాయో లెక్కే లేదని చెప్పారు. ఓట్ల చోరీతోనే మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చారని పునరుద్ఘాటించారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ తరఫున ఎంపీలు గెలవడంపై తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆరు నెలలకే పార్లమెంట్ ఎన్నికలు జరిగితే.. కోటి ఓట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం బీజేపీకి వత్తాసు పలకడం ప్రజల దౌర్భాగ్యమని అన్నారు. ఓట్ల చోరీపై రాహల్‌గాంధీ బిహార్‌లో చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మహేశ్‌గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్ర వరంగల్ జిల్లాలోని ఇల్లందు నుంచి వర్ధన్నపేట వరకు ఉత్సాహంగా సాగింది. వర్ధన్నపేటలో నిర్వహించిన జనహిత పాదయాత్ర సభతోపాటు కరీంనగర్ జిల్లా గంగాధరలో నిర్వహించిన కాంగ్రెస్ నాయకుల సమావేశంలో మహేశ్‌గౌడ్ మాట్లాడారు. బీసీలపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. బీజేపీ తలచుకుంటే ఒక్క రోజులోనే బీసీ రిజర్వేషన్ల చట్టం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు వెళ్లేది 1-2శాతం మాత్రమేనని తెలిపారు. బీసీ అయిన బండి సంజయ్‌కుమార్ బీసీ రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సంజయ్ సహా బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, అర్వింద్ సమయం ఇస్తే రిజర్వేషన్లపై వివరిస్తామని చెప్పారు.
కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కరీంనగర్‌కు ఎన్ని పరిశ్రమలు తెచ్చారని, నిజామాబాద్‌లో అర్వింద్ ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. దేవుడి పేరు చెప్పనిదే మళ్లీ వీళ్లు గెలవలేరని అన్నారు. అసలు తెలంగాణలో ప్రతిపక్షం ఉందా? అసెంబ్లీకి రాని కేసీఆర్‌కు ప్రతిపక్షం హోదా ఎందుకు? అని మహేశ్‌గౌడ్ ప్రశ్నించారు. మేడిగడ్డ కుంగిపోయిందని విచారణకు ఆదేశిస్తే, బీఆర్‌ఎస్ నాయకులు కోర్టుకు వెళ్లడం విచారకరమన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పని అయిపోయిందని, ప్రజా కోర్టులో ఆ పార్టీ నేతలకు శిక్ష పడక తప్పదని హెచ్చరించారు. కేటీఆర్, కవిత మద్య ఆస్తుల పంచాయితీ.. పదేళ్లైనా తెగదని, బీఆర్‌ఎస్ సైతం రెండు వర్గాలుగా చీలిపోయిందని ఎద్దేవా చేశారు. మూడేళ్ల తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వంద సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చే శారు. దేశంలో బీజేపీ అరాచక పాలన సాగిస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ మార్గంలో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో పాల్గొంటుంటే.. బీజేపీ మాత్రం దొంగిలించిన ఓట్లతో అధికారాన్ని అనుభవిస్తోందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన.. దేశానికి ఒక మోడల్‌గా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
మహేశ్‌గౌడ్ దిష్టిబొమ్మల దహనం
బండి సంజయ్‌ను ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్, హుజూరాబాద్, ఇల్లందకుంట, తిమ్మాపూర్, హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్‌లో మహేశ్‌గౌడ్ దిష్టిబొమ్మలను దహనం చేశాయి. మానకొండూర్‌లో రాస్తారోకో నిర్వహించాయి. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ మతిలేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఓట్ చోరీ జరిగితే.. కాంగ్రెస్ ఎలా గెలిచిందని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా రైతులకు హాని జరగనీయం.. అమెరికా టారిఫ్‌లపై మోదీ
ట్రంప్ టారిఫ్‌లపై పీఎంవో కీలక సమావేశం
For More National News