కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం
ABN , Publish Date - May 15 , 2025 | 05:10 AM
ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులుతెలిపారు. మావోయిస్టు సమస్య అంతానికి ఇది ఆరంభమన్నారు.

ఇప్పటి వరకు 28 మందిని గుర్తించాం.. కొందరు అగ్రనేతలూ హతమై ఉంటారు!
నక్సల్స్‌కు లొంగిపోవడం తప్ప దారి లేదు
సీఆర్‌పీఎఫ్ డీజీ జి.పి.సింగ్,ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ వెల్లడి
శాంతిని నెలకొల్పుతాం: ప్రధాని
మార్చి 31 కల్లా నక్సల్స్ రహిత భారత్: షా
చర్ల, మే 14 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులపాటు జరిగిన ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులుతెలిపారు. మావోయిస్టు సమస్య అంతానికి ఇది ఆరంభమన్నారు. బీజాపూర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఆర్‌పీఎఫ్ డీజీ గ్యానేంద్ర ప్రతాప్ (జీపీ)సింగ్, ఛత్తీస్‌గఢ్ డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్.. కర్రెగుట్టల ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేదని స్పష్టం చేశారు. కర్రెగుట్టలపై మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో ఏప్రిల్ 21న ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో బలగాలు కూంబింగ్ చేశాయని, ఆపరేషన్ సాగిన 21రోజుల్లో 21 ఎన్‌కౌంటర్లు జరిగాయని చెప్పారు. అడవుల్లో 450 బీర్ బాంబులు, ఐఈడీలను గుర్తించి నిర్వీర్యం చేసినట్లు తెలిపారు. మొత్తం 31 మంది మావోయిస్టులు చనిపోయారని, ఇప్పటివరకు 28మందిని గుర్తించామని, ఏడుగురి మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని వివరించారు. వీరందరిపై రూ.1.72 కోట్ల రివార్డు ఉందన్నారు. బలగాల దాడిలో చాలా మంది మావోయిస్టులు మృతి చెందారని, సెర్చ్ ఆపరేషన్‌లో మృతదేహాలు దొరుకుతున్నాయని తెలిపారు. మృతుల్లో చాలా మంది కీలక నేతలూ ఉంటారని పేర్కొన్నారు. గుట్టల్లో 214మావోయిస్టు డంపులు గుర్తించామని, 4 ఆయుధ తయారీ ఫ్యాక్టరీలను ధ్వంసం చేశామన్నారు. చనిపోయిన మావోయిస్టుల నుంచి అధునాతన మెషిన్‌గన్స్, ఏకే 47, ఇన్సాస్ తుపాకులు లభించాయని వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 18 మంది జవాన్లు గాయపడ్డారన్నారు. ఆపరేషన్ కగార్ భవిష్యత్తులోనూ కొనసాగుతుందని తెలిపారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు.
వచ్చే మార్చి కల్లా నక్సల్స్ రహిత దేశం: షా
భద్రతా బలగాలు కర్రెగుట్టల్లో 31 మంది కరుడుగట్టిన నక్సలైట్లను హతమార్చడం ద్వారా దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చే లక్ష్యంలో కీలక ముందడుగు వేశాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో నక్సలిజాన్ని తుడిచిపెట్టేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. మార్చి 31, 2026కల్లా దేశాన్ని నక్సల్స్ రహితంగా చేస్తామని మరోసారి హామీ ఇస్తున్నట్లు బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పుతాం: ప్రధాని
నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని మోదీ చెప్పారు. కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులను హతమార్చడం ద్వారా దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించివేయాలన్న ప్రభుత్వ లక్ష్యం దిశగా ముందడుగు పడినట్లు అయిందని పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలను అభివృద్ధిపథంలో నడిపిస్తామని ప్రధాని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.