‘నేరెళ్ల’ ఘటనపై కేసు నమోదైందా?
ABN , Publish Date - Jan 03 , 2025 | 03:13 AM
రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక లారీలను తగలబెట్టారనే ఆరోపణలపై దళితులు, బీసీ యువకులను పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.
నమోదైతే చార్జిషీట్ దాఖలు చేశారా?
దర్యాప్తు ఏ దశలో ఉందో చెప్పండి
బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో 2017లో జరిగిన ఘటనపై హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక లారీలను తగలబెట్టారనే ఆరోపణలపై దళితులు, బీసీ యువకులను పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. ఇసుక లారీ ఢీకొని, ఓ వ్యక్తి మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు పలు ఇసుక లారీలను తగులబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొందరిని చిత్రహింసలకు గురిచేశారు. 2017లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ అప్పట్లో బాధితులను పరామర్శించి.. ఇసుక దందా, బీఆర్‌ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. నేరెళ్ల ఘటనలో చిత్రహింసలకు గురైన బాధితులకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, నిర్బంధ హింసకు పాల్పడిన పోలీసులపై కేసు నమోదుకు ఆదేశాలు ఇవ్వాలని మానవ హక్కుల సంఘం నాయకుడు గడ్డం లక్ష్మణ్, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ వేర్వేరుగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లు గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. నిర్బంధ హింస ఘటనపై కేసు నమోదైందా? నమోదైతే చార్జిషీట్ దాఖలు చేశారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున హాజరైన ఏజీపీ స్పందిస్తూ.. ఈ కేసులో అడ్వొకేట్ జనరల్ (ఏజీ) అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారని, అప్పటివరకు సమయం ఇవ్వాలని కోరారు. ఏజీపీ వద్ద సమాధానాలు లేకపోవడంతో అక్కడే ఉన్న అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదైందని.. పిటిషనర్లు కోరినట్లుగానే కేసు నమోదైనందున ఈ పిటిషన్లను విచారించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సంతృప్తి చెందని ధర్మాసనం.. రెండు వారాల్లో దర్యాప్తు ఏ దశలో ఉందో తెలియజేయాలని ఏఏజీకి ఆదేశాలు జారీచేసింది. స్థాయీ నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీచేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.