Share News

Karimnagar: రైల్వే గేటు వద్ద రెండు ఆర్టీసీ బస్సుల ఢీ

ABN , Publish Date - Mar 01 , 2025 | 05:22 AM

కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్‌ బాక్స్‌లను బస్సులో కరీంనగర్‌కు తరలించి తిరుగు ప్రయాణంలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు.

Karimnagar: రైల్వే గేటు వద్ద  రెండు ఆర్టీసీ బస్సుల ఢీ

  • ఎన్నికల విధుల్లో పాల్గొన్న 19 మందికి గాయాలు

కరీంనగర్‌ క్రైం, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి) : కరీంనగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్‌ బాక్స్‌లను బస్సులో కరీంనగర్‌కు తరలించి తిరుగు ప్రయాణంలో ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నిర్మల్‌ జిల్లాకు చెందిన రెండు ఆర్టీసీ బస్సుల్లో అక్కడి బ్యాలెట్‌ బాక్స్‌లను ఎన్నికల సిబ్బంది గురువారం రాత్రి కరీంనగర్‌లోని అంబేడ్కర్‌ స్టేడియంలో స్ట్రాంగ్‌రూంకు చేర్చారు. అనంతరం తిరిగి నిర్మల్‌కు వెళుతున్న క్రమంలో వేకువజామున 3 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తురుకకాశీనగర్‌ ప్రాంతంలోని రైల్వేగేట్‌ వద్ద బస్సులు ఒక దాని వెనుక మరొకటి ఢీకొన్నాయి.


దీంతో వెనుక బస్సులో ఉన్న 19 మందికి గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్‌ ఎండీ నయీమొద్దీన్‌ కాలు విరిగింది. రెవెన్యూ ఉద్యోగి పురుషోత్తం కడుపు, ఛాతీ భాగంలో దెబ్బలు తగలడంతో ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా 17 మంది ఉద్యోగులకు స్వల్ప గాయాలు కాగా, వారికి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులను నిర్మల్‌ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ కరీంనగర్‌ ఆసుపత్రిలో పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - Mar 01 , 2025 | 05:22 AM