Windows 10 Support End: విండోస్ 10కు సపోర్టు నిలిపివేయనున్న మైక్రోసాఫ్ట్.. చివరి తేదీ ఎప్పుడంటే..
ABN , Publish Date - Oct 02 , 2025 | 07:14 PM
విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్టును అక్టోబర్ 14తో ముగిస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ యూజర్లను అప్రమత్తం చేసింది. ఆ తరువాత విండోస్ 10కు ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ ఉండవని తెలిపింది. అయితే, ఓఎస్ అప్‌గ్రేడేషన్‌కు అవకాశం ఇచ్చేలా పెయిడ్ యూజర్లకు ఎక్సెటెండెడ్ సెక్యూరిటీ అప్‌డేట్ ఫీచర్‌ను కూడా అందుబాటులో ఉంచుతున్నట్టు కంపెనీ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న కంప్యూటర్‌లు వాడేవారికో ఎలర్ట్. అక్టోబర్ 14 నుంచి ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కు (ఓఎస్) సపోర్టు నిలిచిపోతుంది. అంటే, ఇకపై సెక్యూరిటీ అప్‌డేట్స్, ఫీచర్లను మెరుగుపరిచే అప్‌డేట్స్, లేదా సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు టెక్నికల్ సపోర్టు వంటివేమీ యూజర్లకు అందుబాటులో ఉండవు. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ వినియోగదారులను అప్రమత్తం చేసింది (Windows 10 end of support).
అక్టోబర్ 14 తరువాత కూడా విండోస్ 10ను యథాతథంగా వినియోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ అప్‌డేట్స్ లేని కారణంగా సైబర్ ముప్పు పెరిగే అవకాశం ఉంది. సపోర్టు నిలిపివేతతో సాధారణ యూజర్లతో పాటు వ్యాపారాలు కూడా ప్రభావితం కానున్నాయి. మాల్‌వేర్‌లు, వైరస్‌లు, ఇతర సైబర్ దాడుల ముప్పు పెరుగుతుంది. ఇక రెగ్యులేటరీ కంప్లయెన్స్ నిబంధనల్లో సంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కొన్ని రకాల సాఫ్ట్‌వేర్ పనితీరు సన్నగిల్లే అవకాశం కూడా ఉంది (Upgrade from Windows 10).
మైక్రోసాఫ్ట్ ప్రకటన ప్రకారం, అక్టోబర్ 14 తరువాత విండోస్ 10 ఓఎస్‌కు ఎలాంటి అప్‌డేట్స్ ఉండవు.
అయితే, విండోస్ 10 పీసీలను అక్టోబర్ తరువాత కూడా ఎప్పటిలాగే వినియోగించుకోవచ్చు. కానీ సైబర్ దాడుల ముప్పు పెరుగుతుందన్న విషయం మాత్రం మర్చిపోకూడదు.
ఇక ఓఎస్ అప్‌గ్రేడేషన్‌కు తమ పీసీలు అనుకూలమో కాదో తెలుసుకునేందుకు యూజర్లు సెట్టింట్స్ ఆప్షన్‌లోని విండోస్ అప్‌డేట్‌ను ఎంచుకుని పీసీ హెల్త్ చెకప్ ద్వారా తెలుసుకోవచ్చు.
మరికొంతకాలం పాటు విండోస్ 10 వినియోగించుకోవాలనుకునే వారి కోసం అప్‌డేట్స్‌ను మరో ఏడాది పాటు అందుబాటులో ఉంచేలా మైక్రోసాఫ్ట్ ఎక్స్‌టెండెడ్ సెక్యూరిటీ కవరేజీకి (ఈఎస్‌యూ) అవకాశం కల్పిస్తోంది. దీన్ని ఎంపిక చేసుకుంటే 2026 అక్టోబర్ 13 వరకూ విండోస్ 10కు సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందొచ్చు.
వ్యాపార సంస్థలు ఒక్కో పీసీకీ 61 డాలర్ల చొప్పున చెల్లించి ఈఎస్‌యూను సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. దీన్ని మరో మూడేళ్ల పాటు పొడిగించుకునే అవకాశం ఉన్నప్పటికీ ధరలు కూడా ఆ మేరకు పెరుగుతాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది.
విండోస్ 365 క్లౌడ్ పీసీల ద్వారా విండోస్ 10 వాడుతున్న వారికి ఉచితంగా ఈఎస్‌యూ అందుబాటులో ఉంటుంది.
విండోస్ 10తో పోలిస్తే విండోస్ 11 ఎంతో మెరుగని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. కొత్త ఓఎస్‌తో సైబర్ దాడుల ముప్పు 62 శాతం తక్కువ అని వెల్లడించింది. విండోస్ 11తో పోలిస్తే నూతన ఓఎస్ 2.3 రెట్లు వేగంతో పనిచేస్తుందని తెలిపింది. కొత్త ఓఎస్‌పై పెట్టే పెట్టుబడులకు 25 శాతం ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని కూడా తెలిపింది.
విండోస్ 10 పీసీల్లోని మైక్రోసాఫ్ట్ 365 యాప్స్‌కు మాత్రం అక్టోబర్ 2028 వరకూ సెక్యూరిటీ అప్‌డేట్స్ కొనసాగుతాయి. అయితే, ఫీచర్ అప్‌డేట్స్ మాత్రం 2026 ఆగస్టు వరకే అందుబాటులో ఉంటాయి. దీంతో, కొత్త ఓఎస్ వైపు మళ్లేందుకు యూజర్లు తగినంత సమయం దక్కుతుందని కంపెనీ భావిస్తోంది.
ఇక విండోస్ 10 పీసీల భద్రతకు కీలకమైన మైక్రోసాఫ్ట్ డిఫెండర్ యాంటీవైరస్‌కు ఇంటెలిజెన్స్ అప్‌డేట్స్ అక్టోబర్ 2028 వరకూ అందుబాటులో ఉంటాయి. దీంతో, మాల్‌వేర్ ప్రొటక్షన్ మరో రెండేళ్ల పాటు కొనసాగుతుండటంతో యూజర్లు నిశ్చితంగా ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి
అరట్టై వర్సెస్ వాట్సాప్.. వీటి మధ్య తేడాలు ఏంటో తెలుసా
వారానికి ఒక్కసారన్నా స్మార్ట్ ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి.. ఇలా ఎందుకంటే..
Read Latest and Technology News