Teacher Resigns Over AI: చాట్‌జీపీటీతో హోమ్ వర్క్ చేస్తున్న విద్యార్థులు.. విరక్తి పుట్టి టీచర్ రాజీనామా..
ABN , Publish Date - May 16 , 2025 | 07:35 PM
చాట్‌జీపీటీపై విద్యార్థులు అధికంగా ఆధారపడుతూ కనీస విద్యానైపుణ్యాలు లేనివారిగా మారుతుండటం చూసి విరక్తి చెందిన ఓ టీచర్ చివరకు బోధనా వృత్తి నుంచే తప్పుకున్నారు. అమెరికాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యతరగతి వారి ఉద్యోగాలకు ఎసరు తెస్తున్న కృత్రిమ మేథ ఇటు విద్యార్థులపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. హోమ్ వర్క్ చేసేందుకు సైతం చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్‌పై అధారపతున్న విద్యార్థులు.. కనీసం చదవడం, రాయడం కూడా రాని వారిగా తయారవుతున్నారు. ఈ తీరు చూసి విరక్తి పుట్టిన ఓ అమెరికా టీచర్ చివరకు బోధనా వృత్తి నుంచే తప్పుకున్నారు. రాజీనామా చేసే ముందు ఆమె తన ఆవేదనను టిక్‌టాక్‌లో పంచుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది.
తన విద్యార్థుల్లో కనీస విద్యానైపుణ్యాలు కూడా లేకపోవడం చూసి హానా మారియా అనే టీచర్ విపరీతంగా కలత చెందారు. తాను 10వ తరగతి వరకూ ఇంగ్లీష్ బోధిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఏడాది మొదట్లో తన జిల్లాలో స్కూల్ విద్యార్థులకు ఐప్యాడ్స్ ఇస్తుంటారని తెలిపారు.
ఏఐ కారణంగా విద్యార్థుల నైపుణ్యాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘మన దేశంలో అక్షరాస్యత పడిపోవడానికి టెక్నాలజీనే కారణం. ఈ పిల్లల్లో చాలా మందికి కనీసం చదవడం, రాయడం కూడా రాదు. సులభమైన హోమ్ వర్కులు చేసేందుకూ చాట్‌జీపీటీ వంటివాటిపై ఆధారపడటంతో ఈ పరిస్థితి దాపురించింది. కంప్యూటర్లే స్క్రీన్ మీద ఉన్న అంశాలను చదువుతున్నాయి. దీంతో, వారికి పుస్తకంలో ఉన్నది చూసి చదవడం కూడా రావట్లేదు. పిల్లల్లో చపలచిత్తం ఎక్కువైపోయింది. ఏ విషయంపైనా నిమిషానికి మించి దృష్టి నిలపలేకపోతున్నారు. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లలోని అంశాలను వేగంగా స్క్రోల్ చేసేందుకు అలవాటు పడి ఇలా తయారయ్యారు. అసలు వారిలో కుదురే లేకుండా పోతోంది’’ అని అన్నారు.
అమెరికాలో స్కూల్ విద్యార్థుల విద్యా సామర్థ్యాలపై జరిగిన అధ్యయనంలోనూ ఈ విషయాలు స్పష్టమయ్యాయి. మూడో వంతు విద్యార్థులకు పుస్తకం చదవడం వంటి కనీస నైపుణ్యాలు లేవని తేలింది. 13 నుంచి 18 ఏళ్ల మధ్య విద్యార్థులు స్కూల్లో ఉండగానే రోజుకు సగటున 6 గంటలపాటు స్క్రీన్లు స్క్రోల్ చేస్తూ గడిపేస్తున్నట్టు సియాటిల్ చిల్డ్రన్స్ రీసర్జ్ ఇన్‌స్టిట్యూట్ జరిపిన అధ్యయనంలో తేలింది. వారు చదువుపై దృష్టి పెట్టట్లేదని వెల్లడైంది.
‘‘విద్యాశాఖ అధికారులు కూడా ఈ విషయంలో ఉదాసీనంగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. ఈ టెక్నాలజీకి ముందు పిల్లల పరీక్ష ఫలితాలు ఎలా ఉండేవో ఓసారి గుర్తు చేసుకోండి. పెన్ను, లేదా పెన్సిల్ చేతపట్టి ఓ చిన్న పారాగ్రాఫ్ రాయాలన్నా ప్రస్తుతం విద్యార్థులు తెగ చికాకు పడిపోతున్నారు. చిన్న విషయాలకూ చాట్‌జీపీటీపై ఆధారపడే తరం తయారవుతోంది. అసలు కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తే పిల్లల్లో ఉండట్లేదు. తమని తాము నిరూపించుకోవాలన్న కసి కనపడటం లేదు. రెజ్యూమ్, కవర్ లెటర్ ఎలా తయారు చేయాలో అన్న ఆసక్తి వీళ్లకు లేనేలేదు. అంతా చాట్‌జీపీటీ చూసుకుంటుందని అంటున్నారు. ఈ పిల్లలు భవిష్యత్తులో గొప్ప వారు అవుతారన్న ఆశ నాకు అంతరించిపోయింది. కాలేజీకి వచ్చే వరకూ అసలు పిల్లలకు ఈ టెక్నాలజీని దరిచేరనివ్వదు’’ అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి
AIతో GenZ పెళ్లిళ్లు.. తాజా సర్వేలో బయటపడ్డ సంచలన విషయాలు
ICAR Chief Ayyappan: విషాదం.. కావేరీ నదిలో శవమై తేలిన ICAR మాజీ చీఫ్
Operation Sindoor: పాక్ మంత్రి తప్పుడు ప్రచారం.. మరీ ఇంత దిగజారాలా
Read Latest and Technology News