Power Bank Buying Tips: పవర్ బ్యాంక్ కొనాలనుకునేవారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి
ABN , Publish Date - Jul 11 , 2025 | 03:27 PM
పవర్ బ్యాంక్ కొనాలనుకునే వారు కొన్ని విషయాలపై కచ్చితంగా దృష్టిపెట్టాలి. లేకపోతే డబ్బులు వృథా అయ్యే ప్రమాదం ఉంది. మరి ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్‌ల బ్యాటరీ సామర్థ్యాలు పెరుగుతున్నాయి. దేశంలో విద్యుత్ సరఫరా కూడా మెరుగవుతోంది. అయినా కూడా చాలా మందికి పవర్ బ్యాంక్ అవసరం ఇప్పటికీ ఉంది. ఎక్కువ దూరాలు ప్రయాణించే వారికి ఇది తప్పనిసరి. ఈ నేపథ్యంలో పవర్ బ్యాంక్ కొనాలనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Power Bank Buying Tips).
ఎలక్ట్రానిక్ డివైజుల్లో ఒక్కోటి ఒక్కో వోల్టేజ్ వద్ద చార్జ్ అవుతుంది. సాధారణ ఫోన్‌ల చార్జింగ్‌కు ఐదు వోల్టుల విద్యుత్ సరఫరా అవసరం. మరి కొన్ని ఫాస్ట్ చార్జింగ్ ఫోన్‌లకు ఇంతకంటే ఎక్కువ వోల్టేజ్ అవసరం పడుతుంది. ఇలా వివిధ రకాల వోల్టేజ్‌లు అందించే సామర్థ్యం అన్ని పవర్ బ్యాంక్‌లకూ ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు ఫోన్‌ను చార్జ్ చేయలేము. కాబట్టి, మీ ఫోన్ చార్జర్ వోల్టేజ్, పవర్ బ్యాంక్ వోల్టేజ్ చెక్ చేసుకున్నాకే కొనుగోలు చేయాలి.
మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీకి రెండు మూడు రెట్లు అధిక సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌ను ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు మీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4000 ఎమ్ఏహెచ్ అనుకుంటే ఇందుకు కనీసం 10,000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేయాలి.
పవర్ బ్యాంక్‌లో భద్రతా ఫీచర్లు కూడా ముఖ్యమే. ఒక్కోసారి పవర్ బ్యాంక్.. మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఓవర్ చార్జ్ చేసే ప్రమాదం ఉంది. దీంతో, బ్యాటరీ పాడైపోవచ్చు. కాబట్టి, ఓవర్ చార్జింగ్ కాకుండా నిరోధించే సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంకులను ఎంచుకోవడం మంచిది.
ఇక పవర్ బ్యాంక్‌దలోని బ్యాటరీల నాణ్యత కూడా ముఖ్యమే. తక్కువ నాణ్యత గల బ్యాటరీల నుంచి చార్జి లీకవడంతో పాటు ఒక్కోసారి అవి పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే లీథియమ్ పాలిమర్ లేదా లీథియమ్ అయాన్ సెల్ ఉన్న పవర్ బ్యాంకులను ఎంచుకోవాలి. వీటికి బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్నదీ లేనిదీ కూడా చెక్ చేశాకే కొనాలి. ఇవి కాస్త ఖరీదైనవే అయినా భద్రత విషయంలో వినియోగదారులు నిశ్చితంగా ఉండొచ్చు.
పవర్ బ్యాంకులో ఎన్ని చార్జింగ్ పోర్టులు ఉన్నాయన్నదీ కీలకమే. కొన్నింటికి ఒకే చార్జింగ్ పోర్టు ఉంటుంది. వీటితో ఒక సారి ఒకే ఫోన్‌ను చార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్నింటిల్లో రెండు పోర్టులు ఉన్నప్పటికీ వాటి చార్జర్ టైపు వేరుగా ఉండొచ్చు. కాబట్టి, పవర్ బ్యాంకు కొనేముందు, దానిలో ఏయే రకాలు పోర్టులు ఉన్నాయో చెక్ చేశాకే కొనుగోలు చేయాలి.
ఇక హైక్వాలిటీ ప్లాస్టిక్, లేదా అల్యూమినియం కేసింగ్ ఉన్న పవర్ బ్యాంక్‌లను కొనుగోలు చేస్తే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఇక పవర్ బ్యాంక్‌లో చార్జింగ్ ఎంత ఉందో చెప్పే ఇండికేటర్ కూడా ముఖ్యమే. దీంతో, ఎప్పటికప్పుడు పవర్ బ్యాంక్‌ను చార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
పాస్‌వర్డ్స్ లీక్.. భారతీయులకు కీలక సూచనలు జారీ
మీ ఫోన్‌కు హ్యాకింగ్ బెడద వద్దనుకుంటే ఈ టిప్స్ తప్పనిసరిగా పాటించాలి
Read Latest and Technology News