Data Breach: 16 బిలియన్ పాస్‌వర్డ్స్ లీక్.. గూగుల్ సహా అనేక సంస్థల యూజర్ డాటా బట్టబయలు
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:22 AM
యాపిల్, గూగుల్ సహా పలు డిజిటల్ సర్వీసులకు చెందిన 16 బిలియన్ పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ డీటెయిల్స్ బహిర్గతం కావడం సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 బిలియన్‌ల పాస్‌వర్డ్స్, ఇతర లాగిన్ క్రెడెన్షియల్స్ బహిర్గతమవడం ప్రస్తుతం సైబర్ ప్రపంచంలో సంచలనం రేకెత్తిస్తోంది. గూగుల్, యాపిల్, గిట్ హబ్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ మొదలు ప్రభుత్వ సర్వీసుల వరకూ అనేక సంస్థల్లోని యూజర్ల లాగిన్ క్రెడెన్షియల్స్ బయటకుపొక్కడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ఫోర్బ్స్ ఓ సంచలన నివేదిక వెలువరించింది.
ఇప్పటికే 184 మిలియన్ యూజర్ రికార్డులు బట్టబయలు అయినట్టు సైబర్ నిపుణులు ఇటీవల ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా 16 బిలియన్ లాగిన్ వివరాలు బహిర్గతమవడంపై సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫోర్బ్స్ పత్రిక కథనం ప్రకారం, లాగిన్ వివరాలకు సంబంధించి 30 డాటా సెట్స్ బయటపడ్డాయి. ఒక్కో సెట్‌లో 3.5 బిలియన్ వివరాలు ఉన్నాయి. సోషల్ మీడియా లాగిన్ వివరాలు, వీపీఎన్ లాగిన్ డీటెయిల్స్‌తో పాటు కార్పొరేట్, డెవలపర్ వేదికల లాగిన్ వివరాలు కూడా ఈ డాటా సెట్స్‌లో ఉన్నాయి.
ఇదేమీ సాధారణమైన లీక్ కాదని సైబర్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డాటాను భారీ స్థాయిలో దుర్వినియోగపరిచే ఆస్కారం ఉందని అంటున్నారు. వీటిని ఆయుధంగా మలిచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఫిషింగ్ ఎటాక్స్, అకౌంట్ టేకోవర్స్, బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ ఎటాక్స్‌కు వినియోగించే అవకాశం ఉందని అంటున్నారు. అత్యంత విలువైన లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా ఇలా బహిర్గతమవడంతో దీర్ఘకాలిక పరిణామాలు ఉంటాయని కీపర్ సెక్యూరిటీ కోఫౌండర్, సీఈఓ డేరెన్ గుసియోన్ హెచ్చరించారు.
ఇలాంటి దాడుల జరిగే అవకాశం ఉందని గూగుల్ లాంటి సంస్థలు ముందే ఊహించాయి. యూజర్లు తమ డిజిటల్ అకౌంట్స్‌కు తాళం వేసుకునేందుకు పాస్‌వర్డ్స్, టూ ఫాక్టర్ ఆథెంటికేషన్‌లకు బదులు పాస్‌కీలు వాడాలని చెబుతున్నాయి.
ఏమిటీ పాస్‌కీ
ఇది బయోమెట్రిక్ ఆధారంగా పనిచేసే గుర్తింపు ధ్రువీకరణ వ్యవస్థ. పాస్‌వర్డ్స్ వినియోగం ఇక ఎంత మాత్రం సురక్షితం కాదని భావిస్తున్న అనేక డిజిటల్ సంస్థలు పాస్‌కీల వైపు మళ్లుతున్నాయి. పాస్‌కీతో యూజర్లు స్మార్ట్‌ఫోన్ల ద్వారా తమ బయోమెట్రిక్ ధ్రువీకరించుకున్నాకే లాగిన్ అయ్యే అవకాశం కలుగుతుంది. పాస్‌కీలతో ఫిషింగ్ దాడులనుంచి పూర్తి రక్షణ లభిస్తుందని గూగుల్ చెబుతోంది. పాస్‌కీలు వాడేటప్పుడు వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్ ప్రింట్, ఫేషియల్ స్కాన్ లేదా ప్యాటర్న్ లాక్ ఉపయోగించి తమ అకౌంట్‌లోకి లాగిన్ కావొచ్చు.
ఇవి కూడా చదవండి:
12 వేల మంది అభ్యర్థులు.. ఒక్కరికీ జాబ్ ఇవ్వని సంస్థ.. ఎందుకో తెలిస్తే..
చార్జర్‌ను స్విచ్ బోర్డులో అలాగే వదిలేస్తే ఏమవుతుందో తెలుసా
Read Latest and Technology News