Share News

Womens World Cup Cricket: అమ్మాయిలూ ఇక మీవంతు

ABN , Publish Date - Sep 30 , 2025 | 05:28 AM

ఆసియాకప్‌ విజయ సంబరాల్లో మునిగి తేలుతున్న భారత క్రీడాభిమానులను అలరించేందుకు మరో అంతర్జాతీయ టోర్నీ సిద్ధమైంది. నేటి నుంచి 13వ మహిళల వన్డే వరల్డ్‌క్‌పకు...

Womens World Cup Cricket: అమ్మాయిలూ ఇక మీవంతు

నేటి నుంచే వన్డే వరల్డ్‌కప్‌

జూ 47 ఏళ్లుగా భారత్‌ నిరీక్షణ

జూ స్వదేశీ అనుకూలతలపై ఆశాభావం

జూ శ్రీలంకతో ఆరంభ పోరు మధ్యాహ్నం 3 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

గువాహటి: ఆసియాకప్‌ విజయ సంబరాల్లో మునిగి తేలుతున్న భారత క్రీడాభిమానులను అలరించేందుకు మరో అంతర్జాతీయ టోర్నీ సిద్ధమైంది. నేటి నుంచి 13వ మహిళల వన్డే వరల్డ్‌క్‌పకు తెర లేవనుంది. ఈ మెగా టోర్నీకి 12 ఏళ్ల తర్వాత భారత్‌ ఆతిథ్యమిస్తుండడం విశేషం. మంగళవారం గువాహటిలో జరిగే ప్రారంభ మ్యాచ్‌లో శ్రీలంకతో హర్మన్‌ప్రీత్‌ బృందం తలపడనుంది. అయితే భారత మహిళల క్రికెట్‌ జట్టును మాత్రం ఈ విశ్వకప్‌ 47 ఏళ్లుగా ఊరిస్తూనే ఉంది. 1978లో మొదటి వరల్డ్‌కప్‌ జరిగింది. భారత జట్టు 2005, 2017 టోర్నీల్లో రన్నర్‌పతో సరిపెట్టుకుంది. 2022లో జరిగిన చివరి వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటిదాకా జరిగిన టోర్నీల్లో ఆసీస్‌ (7), ఇంగ్లండ్‌ (4) జట్లదే ఆధిపత్యం. 2000లో మాత్రమే న్యూజిలాండ్‌ నెగ్గింది. ఈసారి కూడా ఆసీస్‌, ఇంగ్లండ్‌ జట్లు ఫేవరెట్స్‌గా బరిలోకి దిగబోతున్నాయి. మరోవైపు భారత్‌ ఆతిథ్యమిచ్చిన 1978, 1997, 2013 టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్టే చాంపియన్‌గా నిలవడం విశేషం.


టోర్నీ జరిగేది ఇలా..

ఈ వరల్డ్‌క్‌పలో భారత్‌తో పాటు ఆస్ర్టేలియా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణా ఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్‌ రాబిన్‌ పద్దతిన జరిగే 8 లీగ్‌ మ్యాచ్‌లకు భారత్‌లో గువాహటి, ఇండోర్‌, విశాఖపట్టణం, నవీ ముంబై వేదికలు కానున్నాయి. అలాగే దాయాది పాక్‌ ఆడే మ్యాచ్‌లతోపాటు శ్రీలంక (కొలంబో)లో 11 లీగ్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అక్టోబరు 5న భారత్‌-పాక్‌ పోరుతో పాటు, ఒకవేళ ఫైనల్‌కు ఈ రెండు జట్లు వస్తే కొలంబోనే వేదికగా ఉంటుంది. గ్రూప్‌ దశలో టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌లో ప్రవేశిస్తాయి.


ఆత్మవిశ్వాసంతో

హర్మన్‌ సేన

ఇటీవల వన్డే, టీ20ల్లో ఇంగ్లండ్‌పై గెలిచిన భారత మహిళల జట్టు ఆత్మవిశ్వాసంతో టోర్నీలో అడుగుపెట్టబోతోంది. ముఖ్యంగా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన భీకర ఫామ్‌లో ఉండడం జట్టుకు సానుకూలాంశం కానుంది. ఈ ఏడాది ఆడిన 14 వన్డేల్లో 928 పరుగులు సాధించింది. ఇక కెరీర్‌లో ఐదో వరల్డ్‌కప్‌ ఆడనున్న కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ ఇంగ్లండ్‌పై శతకం, ఆసీ్‌సపై హాఫ్‌ సెంచరీతో జోరు మీదుంది. గాయం నుంచి కోలుకున్న జెమీమా సైతం ఇంగ్లండ్‌తో వామప్‌ మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించింది. అలాగే హర్లీన్‌, రిచా, దీప్తిలతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే పేస్‌ విభాగం కాస్త బలహీనంగానే ఉంది. ఎందుకంటే రేణుకా సింగ్‌ మినహాయిస్తే క్రాంతి, అరుంధతి, అమన్‌జోత్‌ కలిపి 25 వన్డేలు మాత్రమే ఆడారు. దీనికితోడు వామప్‌ గేమ్‌లో అరుంధతి గాయంతో వీల్‌చైర్‌లో మైదానం వీడింది. తను ఎన్ని మ్యాచ్‌లు ఆడగలదో సందేహమే. అయితే స్వదేశీ పిచ్‌లపై తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి, రాధా యాదవ్‌, స్నేహ్‌ రాణాల స్పిన్‌ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. కానీ ఫ్లాట్‌ వికెట్‌ లభిస్తే వీరి ప్రభావం ఏమేరకు ఉండగలదో వేచిచూడాల్సిందే. ఏదిఏమైనా క్లిష్ట పరిస్థితుల్లో తడబాటు లేకుండా ముందుకుసాగితే భారత మహిళలు ఈసారి కప్‌ కొట్టడం కష్టం కాకపోవచ్చు. మరోవైపు టోర్నీ సహ ఆతిథ్య శ్రీలంక జట్టు చమరి ఆటపట్టు నేతృత్వంలో బరిలోకి దిగుతోంది. విశేషంగా రాణిస్తున్న 20 ఏళ్ల స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దేవ్‌మి విహంగపై భారీ ఆశలే పెట్టుకుంది. సొంత గడ్డపైనే తమ ఐదు లీగ్‌ మ్యాచ్‌లను ఆడబోతుండడం వారికి అనుకూలించనుంది.

ఇవి కూడా చదవండి

ట్రోఫీ తీసుకెళ్లిపోయిన పీసీబీ చీఫ్.. మండిపడ్డ బీసీసీఐ సెక్రెటరీ

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 30 , 2025 | 05:29 AM