Abhishek Sharma -Haval SUV: ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అభిషేక్ శర్మకు గిఫ్ట్‌గా భారీ ఎస్‌యూవీ..
ABN , Publish Date - Sep 29 , 2025 | 06:22 PM
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన అభిషేక్ శర్మ హావెల్ హెచ్9 కారును బహుమతిగా అందుకున్నారు. మరి ఈ ఎస్‌యూవీ ప్రత్యేకతలు ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ టోర్నీలో హైలైట్‌గా నిలిచిన ప్లేయర్ అభిషేక్ శర్మ. ఆడిన ఏడు మ్యాచుల్లో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును దక్కించుకున్నాడు. అంతేకాకుండా హావల్ హెచ్-9 కారును గిఫ్ట్‌గా అందుకున్నాడు. మరి అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఈ కారు ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందాం పదండి (Abhishek Sharma Haval H9).
చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్ (GWM) ఈ హావల్ బ్రాండ్ కారును రూపొందించింది. అత్యాధునిక ఫీచర్‌లతో ఎలాంటి పరిస్థితినైనా తట్టుకుని ప్రయాణం కొనసాగించేలా దీన్ని తీర్చిదిద్దింది. ఆఫ్ రోడింగ్‌తో పాటు కుటుంబంతో కలిసి టూర్ వేసేందుకు వీలుగా దీన్ని సిద్ధం చేసింది (Abhishek Sharma Haval H9).
ఈ కారులో 214 హెచ్‌పీ, 380ఎన్‌ఎమ్ టార్క్‌తో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజెన్ ఏర్పాటు చేశారు. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ వ్యవస్థ ఉన్న ఈ ఎస్‌యూవీ గరిష్ఠ వేగం గంటకు 200 కిలోమీటర్లు. లీటరకు 9 నుంచి 12 కిలోమీటర్ల వరకూ మైలేజీ ఇస్తుంది.
4950 ఎమ్ఎమ్ పొడవుండే ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 224 ఎమ్ఎమ్. ఆఫ్ రోడింగ్‌కు అనువుగా ఉండేందుకు 90 లీటర్ పెట్రోల్ ట్యాంకు ఏర్పాటు చేశారు (Haval H9 specs).
ఏడుగురు సౌకర్యవంతంగా ప్రయాణించే సీటింగ్ ఏర్పాట్లు ఉన్న కారులో ఇన్ఫోటెయిన్‌మెంట్ కోసం 14.6 అంగుళాల టచ్ స్క్రీన్, 10 స్పీకర్ ఆడియో, పానరామిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్ తదితర సదుపాయాలు ఉన్నాయి.
ప్రయాణికులకు భద్రతకు కంపెనీ పెద్ద పీట వేసింది. లెవెల్ 2 ఏడీఏఎస్, ట్రాఫిక్ సైన్ రిగన్నిషన్, యాక్సిడెంట్‌ల ముప్పును తగ్గించే రియర్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వ్యవస్థలు కారులో ఉన్నాయి.
జీడబ్ల్యూఎమ్ భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది. ఇక్కడ హెచ్9 కారు ధర రూ.40 లక్షల వరకూ ఉండొచ్చని ఓ అంచనా. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రీమియం ఫీచర్‌లతో, ఆఫ్ రోడింగ్‌కు తమ కారు అత్యంత అనుకూలమని కంపెనీ చెబుతోంది.
ఇవి కూడా చదవండి
భారత్‌ను రెచ్చగొట్టి పెద్ద తప్పు చేశారు.. పాక్ టీమ్‌పై అభిమానుల ఆగ్రహం
ట్రోఫీతో పారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ చీఫ్.. విజయం తర్వాత మైదానంలో హైడ్రామా..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి