Gambhir Message to Gill: నిన్ను సముద్రంలోకి నెట్టేశాం.. గిల్‌కు గంభీర్ హెచ్చరిక
ABN , Publish Date - Oct 12 , 2025 | 08:51 AM
కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్‌కు తను ఇచ్చిన తొలి సందేశం ఇప్పటికీ గుర్తుందని హెడ్ కోచ్ గంభీర్ తాజాగా కామెంట్ చేశాడు. సముద్రంలోకి అతడిని నెట్టేశామని, ముగినిపోతావో, బయటపడతావో తేల్చుకోమని చెప్పానని అన్నాడు. క్రీడాకారుడికి కెప్టెన్సీ బాధ్యతలే అత్యంత కఠిన పరీక్ష అని చెప్పాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ క్రికెట్‌లో శుభమన్ గిల్ శకం మొదలైంది. టెస్టులతో పాటు వన్డేల్లో కూడా గిల్ టీమిండియా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ తరువాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా గిల్ తొలిసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. 25 ఏళ్ల వయసులో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న గిల్.. టీమిండియాకు అత్యంత పిన్న వయస్కుడైన సారథిగా నిలిచాడు. అయితే, కెప్టెన్సీ బాధ్యతలను గిల్‌కు అప్పగించడంపై హెడ్ కోచ్ గౌతం గంభీర్ తాజాగా స్పందించాడు. అతడికి ఇచ్చిన తొలి సందేశం ఏమిటో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు (Gambhir Fist Message to Gill).
‘కెప్టెన్సీ చేపట్టిన అతడితో నేను చెప్పిన విషయాలు ఇప్పటికీ గుర్తున్నాయి. నేను ఒక విషయం అతడికి స్పష్టంగా చెప్పాను. మేం అతడిని సముద్రంలోకి నెట్టేశాము. అక్కడ నుంచి అతడికి రెండే మార్గాలు.. ఒకటి మునిగిపోవడం రెండవది ప్రపంచస్థాయి స్విమ్మర్‌గా బయటపడటం’ అని గంభీర్ చెప్పాడు. ఇక ఇంగ్లండ్ టెస్టులో గిల్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించాడు. ఐదు టెస్టుల్లో 754 పరుగులు చేశాడు. ఒక్క టెస్టు సిరీస్‌లో ఈ స్థాయి పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. అంత ఒత్తిడిలో కూడా రాణించినందుకు గిల్‌పై గంభీర్ ప్రశంసల వర్షం కురిపించారు.
‘నా దృష్టిలో 750 పరుగులు సాధించడం అంత ముఖ్యం కాదు. ఇంగ్లండ్ టెస్టులో కాకపోతే మరో టెస్టులో అతడు ఈ స్థాయిలో పరుగులు చేసుండేవాడు. అందులో నాకెలాంటి డౌట్ లేదు. అయితే ఓ 25 ఏళ్ల యువకుడు, యువ సభ్యులు ఉన్న జట్టును నడిపించిన తీరు, తనని తాను సంభాళించుకున్న వైనం, నాయకత్వ పటిమ, ఒత్తిడులను తట్టుకున్న తీరే నాకు ముఖ్యం. నాయకత్వ బాధ్యతలు నిర్వహించడం కంటే కఠిన పరీక్ష మరొకటి ఉండదు’ అని గంభీర్ అన్నాడు. త్వరలో జరగనున్న ఆస్ట్రేలియా వన్డే టూర్‌కు కూడా గిల్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. దీంతో గిల్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
India Dominates West Indies: అటు బ్యాట్‌తో.. ఇటు బంతితో
Womens World Cup: కంగారూలతో కఠిన పరీక్షే!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి