Womens World Cup: కంగారూలతో కఠిన పరీక్షే!
ABN , Publish Date - Oct 12 , 2025 | 04:49 AM
ప్రపంచ కప్‌లో రెండ్రోజుల క్రితం దక్షిణాఫ్రికా చేతిలో కంగుతిన్న భారత మహిళల జట్టు మరో కఠిన పరీక్షను ఎదుర్కోనుంది...
నేడు ఆస్ట్రేలియాతో భారత్ పోరు
మహిళల వన్డే ప్రపంచ కప్
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ప్రపంచ కప్‌లో రెండ్రోజుల క్రితం దక్షిణాఫ్రికా చేతిలో కంగుతిన్న భారత మహిళల జట్టు మరో కఠిన పరీక్షను ఎదుర్కోనుంది. ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియాతో హర్మన్‌సేన తలపడనుంది. సఫారీలతో మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాటర్లు మరోసారి విఫలం కాగా.. ఆరో బౌలర్ లేని లోటు కనిపించింది. దాన్ని పూడ్చడానికి హర్మన్ బంతిని అందుకోవాల్సి వచ్చింది. 40 ఓవర్ల తర్వాత సఫారీ బ్యాటర్లు.. పేసర్లను టార్గెట్ చేయడంతో కెప్టెన్ హర్మన్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఆరంభంలో మెరుగ్గా బౌలింగ్ చేసిన క్రాంతి గౌడ్, అమన్‌జోత్ డెత్ ఓవర్లలో బ్యాటర్లను కట్టడి చేయలేక పోయారు. మన జట్టు ఫీల్డింగ్ వైఫల్యాలు కూడా ప్రత్యర్థులకు లాభించాయి. ఈ నేపథ్యంలో బలమైన ఆసీ్‌సపై జట్టు కూర్పు మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. కంగారూలపై పార్ట్‌టైమ్ బౌలర్లను దించితే ఆ జట్టు బ్యాటర్లు మరింత విరుచుకుపడే చాన్సుంది. దీంతో లోయర్డార్‌లో బ్యాటింగ్ కూడా చేయగల రాధా యాదవ్‌ను ఆరో బౌలర్‌గా తుది జట్టులోకి తీసుకోవచ్చు ఇదే జరిగితే వన్‌డౌన్‌లో ఇబ్బందిపడుతున్న హర్లీన్‌పై వేటుపడొచ్చు. ప్రధాన బ్యాటర్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్, జెమీమాలు తమ వైఫల్యాన్ని అధిగమించాలి. మరోవైపు ఆస్ట్రేలియా మరోసారి ఫేవరెట్‌గా కనిపిస్తోంది. గత మ్యాచ్‌ల్లో కీలక ప్లేయర్లు విఫలమైనా, గార్డ్‌నర్, బెత్ మూనీ శతకాలతో అదరగొట్టారు. అయితే, లోపాలను సరిదిద్దుకొని ఘన విజయం సాధించాలని అలిస్సా హీలీ సేన పట్టుదలతో ఉంది.