మనకూ ఉందో రేసింగ్ టీమ్
ABN , Publish Date - Feb 23 , 2025 | 11:50 AM
ఐపీఎల్‌తో లీగ్ సంస్కృతి మిగతా క్రీడాంశాల్లోకి కూడా ప్రవేశించింది. బ్యాడ్మింటన్, వాలీబాల్, హ్యాండ్‌బాల్ లీగ్‌లు మంచి ఆదరణ పొందాయి. ఈ మూడు లీగ్‌ల్లోనూ తెలుగోళ్లు ఆడు తున్నారంటే అందుకు కారణం కంకణాల అభిషేక్‌రెడ్డి.

ఐపీఎల్‌తో లీగ్ సంస్కృతి మిగతా క్రీడాంశాల్లోకి కూడా ప్రవేశించింది. బ్యాడ్మింటన్, వాలీబాల్, హ్యాండ్‌బాల్ లీగ్‌లు మంచి ఆదరణ పొందాయి. ఈ మూడు లీగ్‌ల్లోనూ తెలుగోళ్లు ఆడు తున్నారంటే అందుకు కారణం కంకణాల అభిషేక్‌రెడ్డి. మన దేశానికి ఇప్పటివరకు ఒక్క బైక్ రేసింగ్ టీమ్ కూడా లేకపోవడంతో ’బోల్డీ ఇండియన్’ నినాదంతో ‘ఇండీ రేసింగ్ టీమ్’ను ప్రపంచానికి పరిచయం చేశాడు. క్రీడా రంగంలో తనదైన మార్క్ చూపిస్తున్న తెలుగు తేజం అభిషేక్‌రెడ్డి విజయ పరంపర అతడి మాటల్లోనే...
‘
‘నా స్వస్థలం కరీంనగర్ జిల్లా హుజురాబాద్. ప్రాథమిక విద్యాభ్యాసం కరీంనగర్, వరంగల్, నెల్లూరులో... ఉన్నత విద్య కెనడా, యూఎస్‌ఏలో పూర్తి చేశా. బాల్యంలో క్రీడలంటే ఇష్టం ఉండేది కానీ, కెరీర్‌గా ఎంచుకోలేకపోయా. విదేశాలకు వెళ్లాక క్రీడల ప్రాముఖ్యత తెలిసింది. క్రీడలంటే ఆసక్తి ఉన్నవారికి మన దేశంలో ఇప్పటికీ తమ ప్రతిభను చాటేందుకు సరైన వేదికలు లేవని అర్థమైంది. ఒక లాజిస్టిక్స్ కంపెనీ స్థాపించి సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్న తరుణంలో క్రీడలపై ఉన్న మక్కువ నన్ను ఆ రంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో సచిన్ టెండూల్కర్, నిమ్మగడ్డ ప్రసాద్ యాజమాన్యం లోని ‘బెంగళూరు బ్లాస్టర్స్’ జట్టు అమ్మకానికి ఉందని తెలిసి దానిని మరో కంపెనీతో కలిసి 2018లో కొనుగోలు చేసి ‘బెంగళూరురాప్టర్స్’గా పేరు మార్చాం. 2013 నుంచి ఉన్న ఈ జట్టు అప్పటిదాకా ఒక్కసారి కూడా గెలవలేదు. మేము తీసుకున్నాక వరుసగా రెండేళ్లు 2019, 2020 పీబీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టాం. తెలుగు షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, భమిడిపాటి సాయిప్రణీత్‌ను కెప్టెన్లుగా చేసి, తెలుగోళ్లని ప్రోత్సహించి మంచి ఫలితాలు రాబట్టాం.
2018లో మొదలైన ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) లోని బ్లాక్ హాక్స్ హైదరాబాద్ జట్టును 2021లో కొనుగోలు చేసి ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’గా పేరు మార్చాం. ఈ జట్టు యాజమాన్యంలో హీరో విజయ్ దేవరకొండకు కూడా వాటా ఉంది. అప్పటివరకు నాకౌట్‌కు రానీ ఈ టీమ్ మేం పగ్గాలు తీసుకున్నాక 2022లో తొలిసారి సెమీస్ చేరి మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి ఏడాది ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్)లో ‘తెలుగు టాలున్స్’ జట్టును దక్కించుకొని మొదటి సీజన్‌లోనే సెమీస్ చేర్చి, మూడో స్థానంలో నిలబెట్టాం. ఇక, గతేడాది ప్రారంభించిన ఇండీ రేసింగ్ టీమ్ తొలి సీజన్‌లో ప్రఖ్యాత జట్లకు షాకిచ్చి పోడియం ఫినిష్ చేసింది.
గ్రామీణ స్థాయి నుంచి క్రీడారంగాన్ని బలోపేతం చేసే వ్యవస్థను తయారు చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలుత వాలీబాల్ క్రీడను తీసుకుని ప్రయోగం చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండలంలో వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించున్నాం. తొలి దశలో భాగంగా హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నాం.
భారత తొలి బైక్ రేసింగ్ టీమ్
మన దేశానికి ఇప్పటివరకు ఒక అధికారిక బైక్ రేసింగ్ జట్టు లేదు. ఈ విషయాన్ని గమనించి ‘బోల్డీ ఇండియన్’ అనే నినాదంతో ‘ఇండీ రేసింగ్’ అనే బైక్ రేసింగ్ టీమ్‌ను గత ఏడాది ప్రపంచానికి పరిచయం చేశాం. ఎలక్ట్రిక్ బైక్ రేసులు నిర్వహించే ‘ఎఫ్‌ఐఎం ఈ- ఎక్స్‌ప్లోరర్ వరల్డ్‌కప్’లో తొలి ప్రయత్నంలోనే ఇండీ జట్లు మూడోస్థానం దక్కించుకుని పోడియం ఫినిష్ చేసింది. గత నవంబరులో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఈ పోటీల్లో ఇండీ రేసర్లు నాలుగు రౌండ్లలో 479 పాయింట్లు సాధించి తృతీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ప్రఖ్యాత బొనెల్, హోండా రేసింగ్ జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు జట్లు ఏటా బైక్ రేసింగ్ కోసం రూ.150 నుంచి 180 కోట్లు వరకు ఖర్చు చేస్తాయి. అలాంటి జట్లతో పోటీపడ్డాం. ఈ రేసు కోసం మేము మూడు బైకులు మాత్రమే సిద్ధం చేసుకుంటే వారు 10కి పైగా బైకులతో దిగారు. అంతటి మేటి జట్లతో పోటీ పడి పోడియం ఫినిష్ చేయడం, అది తొలి ఏడాది లోనే సాధించడం సాధారణ విషయం కాదు.
ముందు రోజు పాడైన బైక్‌లు..
సరిగ్గా రేసుకు ముందు రోజు మా మూడు బైకుల్లో రెండు ప్రాక్టీసు చేస్తుండగా పాడయ్యాయి. ఒక్క బైక్ మాత్రమే ఉంది. పాడైన బైకులను బాగు చేసే సమయం కూడా లేదు. తెల్లారితే రేసు. ఒక్క బైక్‌తో ఎలా బరిలోకి దిగేదని రేసర్లు దిగాలుపడ్డారు. వెంటనే మా బైక్‌లు రూపొందించిన కంపెనీని సంప్రదించగా రేసింగ్ సర్క్యూట్ దగ్గర్లో ఒక రేసింగ్ రైడర్ ఉన్నాడని అతడితో మాట్లాడి ఆ బైక్‌కు కొంచెం మెరుగులు దిద్ది దానిని వాడుకోవచ్చునని తెలిపింది. ఆగమేఘాలు మీద అతడి దగ్గరకెళ్లి కొన్ని డబ్బులిచ్చి ఆ బైక్‌ను రేసుకు తగ్గట్టుగా సిద్ధం చేసుకున్నాం.
రేసింగ్‌పై యువతకు మక్కువ..
తెలుగు రాష్ట్రాల్లోని యువతకు బైక్ రేసింగ్‌పై ఆసక్తి ఉంది. అలానే వాలీబాల్, హ్యాండ్‌బాల్ గ్రామాల్లో మట్టి, ఇసుకలోనే తెలుగోళ్లు చాలా బాగా ఆడతారు. అలాంటి వారిని ఇండోర్ స్టేడియంలో మ్యాట్‌పైన అంతర్జాతీయ ప్రమాణాలతో ఆడిస్తే అద్భుతాలు సృష్టిస్తారు.
ఇండీ రేసింగ్ ద్వారా దేశంలో మోటర్ స్పోర్ట్స్‌కు, తెలుగు టాలూన్స్‌తో హ్యాండ్‌బాల్‌కు, హైదరాబాద్ బ్లాక్‌హాక్స్‌తో వాలీబాల్‌తో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఆదరణ పెంచేందుకు కృషి చేస్తున్నా.’’
- ఎస్.ఎస్.బి సంజయ్
(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)