Pak Team Criticized: వీళ్లకు బుర్రా బుద్ధీ లేదు.. టీమ్ మేనేజ్‌మెంట్‌ను తిట్టిపోసిన పాక్ దిగ్గజ క్రికెటర్లు
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:37 PM
పాక్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను మాజీ ఆటగాళ్లు అఖ్తర్, వసీం అక్రమ్ దుమ్మెత్తిపోశారు. బుర్ర లేదంటూ మండిపడ్డారు.

ఇంటర్నెట్ డెస్క్: పాక్ ఓటమిని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితి తలెత్తుతుందని ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న పాక్ మాజీ క్రికెటర్లైతే ఎలాంటి మొహమాటాలు లేకుండా పాక్ మేనేజ్‌మెంట్‌ను దుమ్మెత్తిపోస్తున్నారు. పాక్ లెజెండరీ మాజీ క్రికెటర్లు షోయెబ్ అఖ్తర్, వసీం అక్రమ్ తాజాగా పాక్ టీంకు ఇచ్చిపడేశారు. వీళ్లకు బుద్ధి లేదంటూ కడిగిపారేశారు (Champions Trophy 2025 Ind Vs Pak)..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా పాక్, భారత్ మధ్య జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో పాక్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి చవి చూసింది. ఇది చూసి ఎమోషనల్ అయినా పాక్ మాజీ క్రికెటర్ షోయెబ్ అఖ్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇక్కడకు నన్ను పిలిపించి డబ్బులిస్తున్నారు కాబట్టి పాక్ గురించి మాట్లాడుతున్నా.. లేకపోతే వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. వాళ్లను విమర్శించదలుచుకోలేదు. అసలు నేను నా టైం ఎందుకు వేస్టు చేసుకోవాలి’’ అంటూ మండిపడ్డాడు.
Ind Vs Pak: ఓటమి జీర్ణించుకోలేక.. భారత్ ఫ్యాన్స్‌గా మారిపోయిన పాక్ అభిమానులు
పాక్ మేనేజ్‌మెంట్‌కు బుర్రా బుద్ధీ లేదని కూడా అఖ్తర్ ఘాటు వ్యాఖ్య అఖ్తర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ జమానాలో ఐదురుగు బౌలర్లతో బరిలోకి దిగడం ఏంటని ప్రశ్నించాడు. ఆధునిక టీమ్స్ అన్నీ ఆరుగురు బౌలర్లతో బరిలో దిగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ‘‘ఆటగాళ్లని మనం తప్పు పట్టకూడదు. టీమ్ మేనేజ్‌మెంట్ ఎలా ఉందో వాళ్లూ అలాగే తయ్యారయ్యారు. అసలు ఏం చేయాలో కూడా వాళ్లకు తెలీలేదు. రోహిత్, విరాట్, శుభ్‌మన్ గిల్‌కు ఉన్న నైపుణ్యాలు వీళ్లకు లేవు. ఆటగాళ్లకు, మేనేజ్‌మెంట్‌కూ ఏమీ తెలీదు’’ అని తిట్టిపోశాడు.
మరో లెజెండరీ పాక్ బౌలర్ వసీం అక్రమ్ కూడా పాక్ ప్రదర్శనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. టీమ్‌లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘వన్డే క్రికెట్‌లో మనం పురాతన కాలం నాటి వ్యూహాలను అమలు చేస్తున్నాము. మనకు టీమ్‌లో కొత్త నెత్తురు కావాలి. సాహసవంతులు ఉండాలి. టీమ్‌లో ఆరేడుగురికి మార్చాల్సి వచ్చినా పర్లేదు. మొదటి ఆరు నెలలు ఓటములు ఎదురైనా పర్లేదు. కానీ 2026 టీ20 వరల్డ్ కప్‌కు ఇప్పటి నుంచీ సన్నద్ధం కావాలి’’ అని వసీం అక్రమ్ అన్నారు.
Virat Kohli: సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ.. అత్యంత వేగంగా 14 వేల పరుగులు
జట్టు లోపాలను సరిదిద్దడంలో విఫలమైన పాక్ క్రికెట్ బోర్డు చీఫ్ నఖ్వీపై కూడా వసీం అక్రమ్ మండిపడ్డారు. ‘‘చైర్మన్ గారూ.. కెప్టెన్, సెలక్షన్ కమిటీ, కోచ్‌ను పిలిపించుకుని మాట్లాడండి. ఇలాంటి టీంను ఎంపిక చేశారేంటని నిలదీయండి. ఖుష్‌దిల్ షా, సల్మాన్ ఆఘా వికెట్ తీసేవాళ్లలాగా కనబడుతున్నారా? ఈ టీం బాలేదని కొన్ని వారాలుగా నేను మొత్తుకుంటున్నా. కానీ బెస్ట్ టీంను ఎంపిక చేశామని చైర్మన్ చెప్పుకున్నారు. ఇందులో కెప్టెన్‌ది కూడా తప్పు ఉంది. కెప్టెన్ అంటే షిప్‌కు నాయకుడి లాంటి వారు. కానీ తనకు టీంలో ఎలాంటి ప్లేయర్లు కావాలో తనకే తెలీదు. స్టేడియంలో పాక్ అభిమానుల ముఖాలు చూస్తే అంతా అర్థమైపోతుంది. పాక్ బౌలర్లు ప్రారంభించిన 15 ఓవర్ల తరువాత వాళ్లంతా స్టేడియంను వీడటం మొదలెట్టారు. ఇలాంటిది నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇది చాలా విచారకరం’’ అని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి పాక్ నిష్క్రమణ దాదాపుగా ఖరారైపోయిన నేపథ్యంలో జట్టులో సమూల మార్పులు చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..